Telugu Global
National

భారతదేశంలో 1% మంది చేతుల్లో 21% సంపద : ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక

భారత దేశంలో ఆర్థిక, లింగ అసమానతలు పెరిగిపోతున్నాయని ఐక్యరాజ్యసమితి తాజా రిపోర్ట్ స్పష్టం చేసింది. 1 శాతం మంది ధనికుల చేతుల్లో 21% సంపద కేంద్రీకృతమై ఉందని యూఎన్ రిపోర్ట్ తెలిపింది.

భారతదేశంలో 1% మంది చేతుల్లో 21% సంపద : ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక
X

COVID19 వల్ల అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు చితికిపోయాయని, దశాబ్దాల పురోగతిని కోవిడ్ నాశ‌నం చేసిందని ఐక్య‌రాజ్యసమితి పేర్కొంది. UN డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP) సెప్టెంబరు 8న మానవాభివృద్ధికి సంబంధించిన వివిధ సూచికలపై నివేదికను విడుదల చేసింది.

ప్రపంచంలోని అనేక దేశాల పరిస్థితి క్షీణించినట్టే భారత దేశం పరిస్థితి కూడా దారుణంగా క్షీణించిందని రిపోర్ట్ తెలిపింది. హ్యూమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్ లో(HDI) భారత స్థానం 132వ స్థానానికి దిగజారిందని రిపోర్ట్ తెలిపింది.

ప్రపంచంలోని 90 శాతం దేశాల్లో 2020, 2021లో హ్యూమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్ తీవ్రంగా దిగజారిపోయాయి. ఇలా వరసగా రెండు సంవత్సరాలు క్షీణించడం 32 సంవత్సరాల్లో ఇది మొదటి సారని నివేదిక పేర్కొంది.

అయితే ఈ క్షీణత అన్ని దేశాల్లో ఒకేలా లేదు. లాటిన్ అమెరికా, కరేబియన్, సబ్‌సహారన్ ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలు ముఖ్యంగా ప్రభావితమయ్యాయి. భారత్ దేశంలో కూడా HDI వరసగా రెండు సంవత్సరాలు క్షీణించింది. ఆగ్నేయాసియా, ఆఫ్రికా ల కన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ బంగ్లాదేశ్‌, ఇరాక్‌, బ్రెజిల్‌ కంటే భారత్‌ వెనుకబడి ఉంది.

భారతదేశంలోని ప్రజలలో నాలుగింట ఒక వంతు మంది (27.9%) అత్యంత‌ పేదరికంలో జీవిస్తున్నారని, 22% మంది రోజుకు రూ. 160 కంటే తక్కువ సంపాదన‌తో జీవిస్తున్నారని నివేదిక పేర్కొంది.

భారత దేశంలో సంపద అసమానతల గురించి కూడా ఈ నివేదిక పేర్కొంది. అనేక కోట్ల మంది అత్యంత , దుర్భరమైన పేదరికం అనుభవిస్తున్నది ఎంత నిజమో దేశంలోని 1 శాతం మంది సంపన్నులు 21.7% సంపదను నియంత్రిస్తున్నారన్నది కూడా అంతే నిజం అని నివేదిక తెలిపింది. దేశ జనాభాలో 40% మంది సంపదలో 19.8% మాత్రమే సంపద కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది.

అంతే కాదు భారత దేశంలో లింగ ఆధారిత అసమానతల గురించి కూడా నివేదిక ప్రస్తావించింది. ఆ జాబితాలో భారత్ ప్రపంచంలో 132వ స్థానంలో ఉంది. పార్లమెంటులో మహిళలు 13.4 శాతం మాత్రమే ఉండగా, ఉద్యోగాల్లో 19.2 శాతం ఉన్నారు. స్త్రీల తలసరి స్థూల జాతీయ ఆదాయం 2,277 డాలర్లు కాగా పురుషుల తలసరి స్థూల జాతీయ ఆదాయం 10,633 డాలర్లు. మహిళల‌ ఆయుర్దాయం 65.8 సంవత్సరాలు కాగా పురుషుల ఆయుర్దాయం 68.9 సంవత్సరాలు . మొత్తంమీద, భారతదేశంలోని మహిళలకు హ్యూమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్ స్కోరు 0.567 ఉండగా పురుషులకు 0.668 ఉంది.

అసలే అసమానతలు రాజ్యమేలే భారత్ దేశంలో కరోనా వాటిని మరింత పెంచింది. పేద భారత దేశం, ధనిక భారత దేశం అనే రెండు దేశాలుగా దేశం విడిపోయి ఉందనేది అర్దమవుతోంది. అందులోనూ స్త్రీ పురుషుల మధ్య అసమానతలను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఈ పోలరైజేషన్ దేశ అభివృద్దికి అడ్డంకిగా మారుతుందనేది వంద శాతం నిజం. ప్రజల్లో ఈ రాజకీయ వ్యవస్థల పట్ల విసుగు, వ్యతిరేకత పెరిగిపోవడం కూడా జరగవచ్చు.

First Published:  9 Sept 2022 12:50 PM IST
Next Story