Telugu Global
NEWS

రెండు తెలుగు రాష్ట్రాల్లో మోదీకి నిరసన సెగలు తప్పవా..?

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తున్న మోదీ, విశాఖ రైల్వే జోన్ కి మొండి చేయి చూపిన మోదీ.. ఇప్పుడు అదే విశాఖలో అడుగు పెడుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మోదీకి నిరసన సెగలు తప్పవా..?
X

రేపు ఏపీ, ఎల్లుండి తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఏపీలో వైసీపీ, బీజేపీ రెండూ పోటాపోటీగా మోదీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ హడావిడి మామూలుగా లేదు. అయితే రెండు రాష్ట్రాల్లో మోదీ పర్యటన సానుకూలంగా జరుగుతుందా..? ఎనిమిదేళ్లుగా విభజన హామీలు మరిచిన మోదీని ప్రజలు నిలదీస్తారా..? ఈ ప్రశ్నలే ఇప్పుడు బీజేపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తున్న మోదీ, విశాఖ రైల్వే జోన్ కి మొండి చేయి చూపిన మోదీ.. ఇప్పుడు అదే విశాఖలో అడుగు పెడుతున్నారు. మోదీ పర్యటన కోసం ఇప్పటికే ఆంధ్రా యూనివర్శిటీలో చెట్లు నరికేశారు, చిన్న చిన్న క్యాంటీన్లు కూల్చేశారు. ఆ రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. ఈ హడావిడిపై వామపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే విశాఖ ఉక్కు కార్మికులు తమ నిరసన తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నామంటూ స్పష్టమైన హామీ ఇవ్వకపోతే మోదీ పర్యటనను అడ్డుకుంటామని సీపీఐ, సీపీఎం నేతలు హెచ్చరించారు. ప్రధాని పర్యటన జరిగే రెండు రోజులు తమ నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రజలు కూడా నల్లజెండాలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ పరిస్థితి ఏంటి..?

అటు తెలంగాణలో కూడా మోదీ పర్యటన విషయంలో విద్యార్థి జేఏసీ, మేధావుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకుని ఇక్కడ పర్యటనకు వస్తారని నిలదీస్తూ ఆయనకు బహిరంగ లేఖ రాశారు తెలంగాణ మేధావులు. ఎనిమిదేళ్లలో ఏం ఇచ్చారో చెప్పాలన్నారు, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. విద్యార్థి నేతలు కూడా మోదీకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. గవర్నర్ ను శిఖండిలా వాడుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, పెండింగ్ బిల్లులతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు యూనివర్శిటీల విద్యార్థి జేఏసీ నేతలు. రామగుండంలో మోదీకి గుండు గీకి సున్నం పెడతామన్నారు.

అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ప్రధాని మోదీకి నిరసన సెగలు తప్పేలా లేవు. ఎనిమిదేళ్లుగా విభజన హామీలను తేల్చకుండా తాత్సారం చేస్తూ ఇప్పుడు తగుదునమ్మా అంటూ పర్యటనకు వస్తున్న మోదీకి తగిన గుణపాఠం చెబుతామంటున్నారు వామపక్షాల నేతలు. ఈ నిరసనలపై ఇటు ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపినా, అటు తెలంగాణలో మాత్రం మోదీకి పరాభవం తప్పేలా లేదు. అందుకే మోదీ పర్యటనకోసం బీజేపీ భారీగా జాగ్రత్తలు తీసుకుంటోంది.

First Published:  10 Nov 2022 8:32 AM IST
Next Story