ప్రమాదంలో ప్రపంచంలోని అతిపెద్ద అడవి
ఈ ఏడాది ఆరు నెలల కాలంలోనే 34 శాతం అటవీ ప్రాంతం క్షీణించినట్టు బ్రెజిల్ నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ వెల్లడించింది. బ్రెజిల్ అధ్యక్షుడు కఠిన పర్యావరణ విధానాలు తీసుకొచ్చిన తర్వాతనే ఈ విధంగా జరగడం ఆశ్యర్యకరం.
అది ప్రపంచంలోనే దట్టమైన అడవి. లక్షల కిలోమీటర్ల మేర విస్తీర్ణం. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ నుంచి పెరు, కొలంబియా, బొలీవియా, ఈక్వెడార్, ఫ్రెంచ్ గినియా, గయానా, సురినామె, వెనిజులా వంటి దేశాలకు విస్తరించి ఉంది. కోట్లాది వృక్ష జాతులు, జీవరాసులకు ఆవాసం. జీవ వైవిధ్యానికి ఈ అడవి పెట్టింది పేరు. అమెజాన్‌తో పాటు ఎన్నో నదులకు పుట్టినిల్లు. అదే అమెజాన్ అడవి.
ప్రపంచ వాతావరణాన్నే క్రమబద్ధీకరించే అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. అత్యంత వేగంగా అటవీ ప్రాంతం క్షీణిస్తుంది. గత నాలుగేళ్లో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆరు నెలల కాలంలోనే 34 శాతం అటవీ ప్రాంతం క్షీణించినట్టు బ్రెజిల్ నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ వెల్లడించింది. బ్రెజిల్ అధ్యక్షుడు కఠిన పర్యావరణ విధానాలు తీసుకొచ్చిన తర్వాతనే ఈ విధంగా జరగడం ఆశ్యర్యకరం. 2030 కల్లా అమెజాన్ అటవీ క్షీణతకు అంతం పలుకుతామని ఆయన ఈ ఏడాది జనవరిలోనే హామీ ఇచ్చారు.
అటవీ క్షీణతను ఆపేందుకు అన్ని చర్యలు ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి తెలిపారు. ఒక్క జూన్ నెలలోనే 663 కిలో మీటర్ల అటవి నశించింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే ఇది 41 శాతం తగ్గినట్టు. ఈ ఏడాది క్షీణత ఇదే విధంగా ఉంటుందా...? అంటే ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే జూలై నుంచి సెప్టెంబర్ నెలల్లో అగ్ని ప్రమాదాలు చాలా జరుగుతాయి. జూలైలో అటవీ క్షీణత తీవ్రంగా ఉంటుంది అని పర్యావరణ శాఖ మంత్రి అన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అడవులు క్షీణించి, కాలుష్యం పెరిగి వాతావరణ సమతుల్యత దెబ్బతింది. కాలుష్యాన్ని నివారించేందుకు అన్ని దేశాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. పారిస్ ఒప్పందంలో చాలా తీర్మానాలు చేసుకున్నాయి. అలాంటి సమయంలో ప్రపంచ వాతావరణాన్నే క్రమబద్దీకరించే అమెజాన్ అటవీ ప్రాంతం క్షీణించడమనేది అన్ని దేశాలకు నష్టమే.