కలవరపెడుతున్న కలరా.. - ప్రపంచ వ్యాప్తంగా విజృంభణ
అయినా డిమాండుకు సరిపడా వ్యాక్సిన్లు లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 21వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత కూడా కలరాతో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పారు.
ప్రపంచంలోని 29 దేశాల్లో కలరా విజృంభిస్తోంది. దాదాపు 29 దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 15 వేల మందికి పైగా కలరా సోకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ప్రపంచ దేశాల్లో దీని విజృంభణ కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా మరణాల రేటు కూడా పెరుగుతోందని తెలిపింది. ఇప్పటివరకు అధికారికంగా 1200కు పైగా కేసులు నమోదు కాగా, 280 మంది మృతిచెందారని వెల్లడించింది. వీరు గాక మరో 14 వేల మందికి పైగా కలరా సోకి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
కారణాలివీ..
సాధారణంగా కలుషిత ఆహారం, నీటితో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న వరదలు, కరువులు, తుపానులు ఈ ఏడాది కలరా కేసులు పెరగడానికి దోహదం చేశాయని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాదీ నమోదయ్యే కేసులతో పోల్చితే ఈ ఏడాది ఈ వ్యాధి వ్యాప్తి మూడు రెట్లు అధికంగా ఉందని పేర్కొంటున్నారు.
టీకాల కొరత..
ఒకపక్క ప్రపంచ వ్యాప్తంగా కలరా కేసులు విజృంభిస్తుండగా, టీకాల కొరత ఇప్పుడు సవాల్‌గా మారింది. చాలా దేశాల్లో కలరా కేసులు పెరుగుతున్నాయని, ప్రస్తుతం డిమాండుకు సరిపడా టీకాలు తమ వద్ద లేవని, చాలా దేశాలు డిమాండ్ చేస్తున్నా వాటిని అందించడం ఇప్పుడు కష్టతరంగా మారిందని డబ్ల్యూహెచ్‌వో కలరా, అంటువ్యాధుల విభాగాధిపతి డాక్టర్ ఫిలిప్ బార్బోజా తెలిపారు. టీకా కొరత ఉండటంతో రెండు డోసులు తీసుకోవాల్సిన టీకాను ప్రస్తుతం ఒక డోసుకు పరిమితం చేశామని చెప్పారు. అయినా డిమాండుకు సరిపడా వ్యాక్సిన్లు లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 21వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత కూడా కలరాతో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పారు.
కోవిడ్ ప్రభావంతో తగ్గిన ఉత్పత్తి..
సాధారణంగా ఏటా కలరా టీకా డోసులను 3.60 కోట్ల వరకు డబ్ల్యూహెచ్‌వో అందుబాటులో ఉంచుతుంది. ఇటీవల కరోనా మహమ్మారి విజృంభించడంతో కోవిడ్ టీకాపై తయారీ సంస్థలన్నీ దృష్టి పెట్టాయి. దీంతో కలరా టీకా తయారీకి సంస్థలు ముందుకు రావడం లేదని, దానివల్లే కొరత ఏర్పడుతోందని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు.