Telugu Global
International

మిలిటెంట్ల టార్గెట్‌ జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎందుకు?

కొనసాగుతున్న ఆపరేషన్‌ ...155 మంది బందీలను విడిపించిన భద్రతా దళాలు

మిలిటెంట్ల టార్గెట్‌ జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎందుకు?
X

పాకిస్థాన్‌లో హైజాక్‌ గురైన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌కు కొన్నేళ్లుగా ముప్పు పొంచి ఉన్నది. బలోచ్‌ రెబల్స్‌, తెహ్రీకే తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) గ్రూప్‌ ఈ రైలును లక్ష్యంగా చేసుకొన్నాయి. దీనికి చాలా వ్యూహాత్మక కారణాలున్నాయి. ఈ రైల్లో తరచూ సైనిక దళాలను క్వెట్టా నుంచి పంజాబ్‌కు తరలిస్తుంటారు. దీంతో మిలిటెంట్‌ గ్రూప్‌లకు ఇది హాట్‌ టార్గెట్‌గా మారింది. 2018, 2023లో పలుమార్లు దీన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు.

2018లో పంజాబ్‌ వెళ్తున్న రైలుకు అత్యంత సమీపంలో రెండు బాంబులు పేలాయి. బలోచ్‌ రెబల్స్‌ రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో ఈ దాడికి పాల్పడ్డారు. నాడు ప్రమాదం నుంచి ఇది బైటపడింది. 2023 జనవరి 19న రైల్లో బాంబుపేలి 13 మంది గాయపడ్డారు. క్వెట్టాకు 150 కిలోమీటర్ల దూరంలోని బొలాన్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నెల రోజుల తర్వాత అదే రైలు క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తుండగా బాంబు పేలుడు జరిగింది. దీనిలో ఒకరు మరణించారు. ఇక గత ఏడాది క్వెట్టా రైల్వే స్టేషన్‌లో పేలుడు జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

155 మంది బందీలను విడిపించిన భద్రతా దళాలు

తాజాగా పాక్‌లోని బోలన్‌ జిల్లాలో హైజాక్‌కు గురైన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి 155 మంది బందీలను భద్రతా దళాలు సురక్షితంగా కాపాడాయి. ఈ క్రమంలో 27 మంది వేర్పాటువాదులను మట్టుబెట్టాయి. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతున్నది. రైల్లోని తొమ్మిది బోగీల్లో 400 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రైలు క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. రైల్లో ఉన్న బలోచ్‌ మిలిటెంట్లు చిన్న బృందాలుగా విడిపోయి ఉండటంతో.. ఆపరేషన్‌ కష్టతరంగా మారినట్లు భద్రతావర్గాలు చెబుతున్నాయి.

బందీల భయానక అనుభవాలు

జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి ప్రాణాలతో బైటపడిన బందీలు తమ భయానక అనుభవాలను పంచుకొన్నారు. మొదట భారీ పేలుళ్లు వినిపించాయని.. ఆ తర్వాత కొంతసేపు కాల్పులు జరిగాయని అల్లాదిత్తా అనే ప్రయాణికుడు చెప్పాడు. దీంతో ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోవడానికి సీట్ల తలదాచుకున్నారు. మిలిటెంట్లు మహిళలు, పురుషులను వేర్వేరుగా ఉంచారు. తాను హృద్రోగినని చెప్పడంతో తన కుటుంబాన్ని వదిలేశారని అతను పేర్కొన్నాడు.

రైల్లోకి మిలిటెంట్లు ప్రవేశించిన వెంటనే ప్రయాణికుల ఐడీ కార్డులను చెక్‌ చేశారు. సైన్యం, భద్రతా దళాల్లో పనిచేసే వారిని గుర్తించి వేరు చేశారు. ఇద్దరిని తమ ముందే కాల్చివేశారని ఓ ప్రయాణికుడు వెల్లడించారు. మరో నలుగురిని తీసుకెల్లారని అన్నారు. వీరితోపాటు పంజాబ్‌ ప్రాంతం వారిని కూడా బందీలుగా పట్టుకొన్నట్లు వెల్లడించాడు. సైన్యం కిడ్నాప్‌ చేసిన రాజకీయ ఖైదీలు, ఉద్యమకారులు, అదృశ్యమైన వ్యక్తులను 48 గంటల్లో విడిచిపెట్టాలని బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ డిమాండ్‌ చేస్తున్నది. లేకపోతే తమ బందీలుగా ఉన్న వారిని చంపేస్తామని బెదిరిస్తున్నది. అంతేకాదు.. రైలును కూడా ధ్వంసం చేస్తామని చెబుతున్నది.

First Published:  12 March 2025 1:07 PM IST
Next Story