Telugu Global
International

అంత‌రిక్షంలో ట్రాఫిక్ జామ్‌…

రాకెట్ ప్ర‌యోగాల ఆలస్యానికి కారణం అదే.. వసుధైక కుటుంబ స్ఫూర్తితో స్వచ్ఛందంగా వ్యర్థాలు తొలగించిన ఇస్రో.

అంత‌రిక్షంలో ట్రాఫిక్ జామ్‌…
X

నగరం పెద్దదయ్యే కొద్దీ ట్రాఫిక్ పెరుగుతుంది. మెట్రో సిటీలలో ట్రాఫిక్‌ జామ్‌ కష్టాలు మాములుగా ఉండవు. మరి విశాలమైన అంతరిక్షంలో కూడా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుందా. ఒకవేళ అలా జరిగితే ఏంటి పరిస్థితి. ఇలాంటి ప్రశ్నలకు ఇస్రో సమాధానం ఇచ్చింది. అసలు ఇలాంటి సంఘటనలు జరుగుతాయో లేదో కూడా క్లారిటీ ఇచ్చింది.



ప్రపంచంలో చాలా దేశాలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నాయి. ఒక దేశానికి మంచి ఇంకో దేశం ప్రయోగాల్లో ముందు ఉంటూ రాకెట్లను నింగిలోకి పంపుతున్నాయి. ఇప్పుడు ఆ రాకెట్ల ప్రయోగాల వల్ల స్పేస్ నిండిందట. రోదసీలో భారీ సంఖ్యలో వ్యర్థాలు పేరుకుపోయాయట. ఈ విషయాన్ని ఇస్రో ప్రకటించింది.

10 సెంటీ మీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న చిన్న చిన్న వస్తువులే మిలియన్ల కొద్దీ అంతరిక్షంలో మిగిలిపోయాయి. వీటివల్ల రోదసీలోకి మనం పంపిన ఉపగ్రహాలు, ఇతర కీలక పరికరాలకు ఎంతో ముప్పు ఉంది. మొత్తం స్పేస్‌లో 27 వేల అంతరిక్ష వస్తువులు ఉన్నాయి. అయితే వీటిలో 80 శాతం వ్యర్థాలేనని తెలుస్తోంది. అమెరికా, రష్యా, భారత్‌, చైనా చేసే యాంటీ శాటిలైట్‌ పరీక్షలు కూడా రోదసీ ఆస్తులకు ముప్పు కలిగిస్తాయి. అసలు అంతరిక్షంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోవడం వల్లనే జులై 30వ తేదీన శ్రీహరికోట నుంచి చేసిన PSLV ప్రయోగం ఒక నిమిషం పాటు ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం ఆరున్నరకు నింగిలోకి వెళ్లాల్సిన PSLV 6 గంటల 31 నిమిషాలకు వెళ్ళింది. 500 కిలోమీటర్ల పైన భూకక్ష్యలో అంతరిక్ష వస్తువులతో ఆ ప్రాంతం దట్టంగా నిండిపోవడంతో ప్రయోగానికి ఆలస్యమైనట్టు ఇస్రో పేర్కొంది. ఆ రోజు చేసిన ప్రయోగం మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ సింగపూర్. ఇక ఇప్పుడు ఈ PSLV రాకెట్ ప్రత్యేకమైన కక్ష్యను తగ్గించే ప్రయోగాన్ని నిర్వహించింది ఇస్రో. భూమికి 536 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోన్న PSLV నాలుగో దశను ఉద్దేశపూర్వకంగా 300 కిలోమీటర్ల కక్ష్యలోకి తగ్గించారు. ఎందుకంటే భూ ఉపరితలం నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూకక్ష్య అత్యంత విలువైనది. అందుకే వసుధైక కుటుంబం అన్న స్ఫూర్తితో ఇస్రో స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసింది. అయితే ప్రయోగించిన రాకెట్ల కక్ష్యను 300 కిలోమీటర్లకు తగ్గించడం ద్వారా నాలుగో దశలోని PSLV వ్యర్థాలు భూమికి తిరిగి చేరి కాలిపోతున్నాయి. ఒకవేళ ఇస్రో ఇలా చేయకపోయి ఉంటే వ్యర్థాలు మరో పద్దెనిమిదేళ్లు ఆ కక్ష్యలోనే తిరుగుతూ ఉంటాయి. అలాగే పనికిరాని మేఘట్రోపిక్స్ ఉపగ్రహాన్ని కూడా సురక్షితంగా నిర్వీర్యం చేశారు.




యూఎస్ స్పేస్ క‌మాండ్ అంచ‌నా ప్రకారం స్పేస్‌లో 40 శాతం స్పేస్ వ్యర్థాలు అమెరికాకు చెందిన‌వి, 28 శాతం ర‌ష్యాకు, 19 శాతం చైనాకు చెందిన‌వి. ఇక భారత్‌ వ‌ల్ల ఏర్పడిన అంత‌రిక్ష వ్యర్థాల శాతం కేవ‌లం 0.8 శాతం మాత్రమేనని ఇస్రో త‌న రిపోర్టులో తెలిపింది. అంటే లెక్క పెట్టి చూస్తే మనవి కేవలం 217 వ‌స్తువులు మాత్రమే.

First Published:  7 Aug 2023 5:40 PM IST
Next Story