యెమెన్‌లోని హూతీలపై అమెరికా భీకర దాడి
ఇప్పటివరకు 31 మంది మృతి చెందగా.. 101 మంది గాయపడినట్లు హూతీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

యెమెన్‌లోని హూతీలపై ట్రంప్ సర్కార్ సైనిక చర్యను ప్రారంభించింది. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇప్పటివరకు 31 మంది మృతి చెందగా.. 101 మంది గాయపడినట్లు హూతీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా నౌకలు, విమానాలపై హూతీలు దాడులు చేయడాన్ని సహించేది లేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. ఇక అగ్రరాజ్య దాడులను హూతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది.
తిరుగుబాటుదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భగ్గుమన్నారు. హూతీలు మీ సమయం ఆసన్నమైంది. మీ దాడులు వెంటనే ఆపేయాలి. ఊహించని పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది అని ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ప్రపంచ జలమార్గాల్లో అమెరికా వాణిజ్య, యుద్ధ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తీ ఆపలేదన్నారు. హూతీలకు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేయాలని ఇరాన్ హెచ్చరించింది. వారి చర్యలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.