Telugu Global
International

గ్రీన్ కార్డ్‌పై అమెరికా కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు.. - వేలాదిమంది భార‌తీయుల‌కు ల‌బ్ధి..!

ఉపాధి కోసం యూఎస్‌కు వెళ్లి అక్క‌డే శాశ్వ‌తంగా ఉండాల‌నుకునే వ‌ల‌స‌దారుల‌కు అమెరికా ప‌ర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ (గ్రీన్ కార్డ్‌)ల‌ను ఇస్తుంటుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం.. ప్రతియేటా సుమారు 1,40,000 గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది.

గ్రీన్ కార్డ్‌పై అమెరికా కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు.. - వేలాదిమంది భార‌తీయుల‌కు ల‌బ్ధి..!
X

గ్రీన్ కార్డ్‌పై అమెరికా కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. విదేశీయుల‌కు అమెరికాలో శాశ్వ‌త నివాసం కోసం జారీ చేసే గ్రీన్ కార్డ్ అర్హ‌త నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళ‌త‌రం చేసింది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను వెల్ల‌డించింది. దీంతో అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న వేలాది మంది భారతీయులకు ల‌బ్ధి చేకూరనుంది.

రెన్యూవ‌ల్ చేసుకునేవారికి సైతం..

గ్రీన్ కార్డుల జారీ విషయంలో తాజాగా అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) జారీ చేసిన మార్గదర్శకాలు భారతీయ సాంకేతిక నిపుణులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పలువురు భావిస్తున్నారు. అమెరికాలో స్థిరపడాలన్న వారి కోరికను సాకారం చేసుకునేందుకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. గ్రీన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కాకుండా రెన్యూవల్ చేసుకునే వారికి కూడా నూతన మార్గదర్శకాలు వర్తింపచేయనున్నట్టు అమెరికా వెల్లడించ‌డం గ‌మ‌నార్హం.

ఉపాధి కోసం యూఎస్‌కు వెళ్లి అక్క‌డే శాశ్వ‌తంగా ఉండాల‌నుకునే వ‌ల‌స‌దారుల‌కు అమెరికా ప‌ర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ (గ్రీన్ కార్డ్‌)ల‌ను ఇస్తుంటుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం.. ప్రతియేటా సుమారు 1,40,000 గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది. ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్య (కోటా)లో మాత్రమే వీటిని ఇస్తుంది. మొత్తం దరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7 శాతం మాత్రమే కేటాయించాలన్నది ప్రస్తుత విధానం.

ఈఏడీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం గ్రీన్ కార్డు జారీ చేస్తున్నారు. తాజాగా ఈఏడీ నిబంధనలను సడలించిన నేపథ్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు మద్దతిచ్చినట్లవుతుందని వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాది అజయ్ భూటోరియా తెలిపారు. అమెరికాలో చట్టబద్ధంగా పని చేసే వారి సంఖ్యను పెంపొందించేందుకు తాజా నిర్ణయం దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

First Published:  18 Jun 2023 3:59 AM GMT
Next Story