హిజాబ్ పై వ్యతిరేకత.. స్టేజ్ పైనే జుట్టు కత్తిరించుకున్న స్టార్ సింగర్
తాజాగా టర్కీ కి చెందిన ఒక ప్రముఖ సింగర్ స్టేజ్ పై ప్రదర్శన నిర్వహిస్తూ తన జుట్టును కత్తిరించుకొని నిరసన తెలిపింది.
ఇరాన్ లో హిజాబ్ పై వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. తాజాగా టర్కీ కి చెందిన ఒక ప్రముఖ సింగర్ స్టేజ్ పై ప్రదర్శన నిర్వహిస్తూ తన జుట్టును కత్తిరించుకొని నిరసన తెలిపింది. ఇరాన్ లో కొద్ది రోజుల కిందట మాషా అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె కస్టడీలోనే మరణించింది. ఈ సంఘటనపై ఇరాన్ మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ సంఘటనకు నిరసనగా, ఇరాన్ చట్టాలకు వ్యతిరేకంగా వేలాదిమంది మహిళలు, ప్రజలు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిరసనల్లో ఇప్పటికే 50 మందికి పైగా ఆందోళనకారులు మృతి చెందారు. హిజాబ్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా మహిళలు తమ జుట్టును కత్తిరించుకుంటూ వ్యతిరేకత తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా టర్కీలోని ప్రముఖ సింగర్ మెలీక్ మాసో హిజాబ్ కు వ్యతిరేకంగా తన నిరసనను తెలిపింది. స్టేజ్ పై ప్రదర్శన నిర్వహిస్తూ తన తల వెంట్రుకలను కత్తిరించుకుంది.
ఇరాన్ లో హిజాబ్ ధారణపై ఉన్న కఠిన చట్టాలకు వ్యతిరేకంగా ఈమె తన వ్యతిరేకతను తెలియజేసింది. కాగా మెలీక్ మాసో స్టేజ్ పై జుట్టు కత్తిరించుకుంటున్న సమయంలో ప్రేక్షకుల నుంచి భారీ మద్దతు లభించింది. వారు చప్పట్లు కొడుతూ మాసోకు మద్దతు తెలిపారు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కొందరు ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.