కాబోయే కోడలికి పదవి కట్టబెట్టిన ట్రంప్
కింబర్లీ గిల్ఫోయిల్‌ను గ్రీస్‌కు అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్.. ఈసారి తన పాలకవర్గంలో కుటుంబసభ్యులు, బంధువర్గానికి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు వియ్యంకులకు కీలక బాధ్యతలు కేటాయించిన ఆయన తాజాగా తనకు కాబోయే కోడలికి కూడా పదవి కల్పించారు. కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు కాబోయే భార్య కింబర్లీ గిల్ఫోయిల్‌ను గ్రీస్‌కు అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో వెల్లడించారు. 'కింబర్లీ గిల్ఫోయిల్ కొన్నేళ్లుగా మా కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా ఉన్నారు. గ్రీస్‌తో రక్షణ సహకారం, వాణిజ్యం, ఆర్థిక ఆవిష్కరణలు తదితర విషయాల్లో ఆమె బలమైన దౌత్య సంబంధాలు నెలకొల్పగలదని ఆకాంక్షిస్తున్నాను. న్యాయవ్యవస్థ, మీడియా, రాజకీయాయాల్లో ఆమెకున్ అనుభవం ఆమె పనితీరును మరింత అద్భుతంగా మారుస్తుంది' అని ట్రంప్ రాసుకొచ్చారు. అయితే ఈ పోస్టులో కుమారుడితో ఆమె బంధాన్ని పేర్కొనకపోవడం విశేషం.
2020 డిసెంబర్ 31న డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో కింబర్లీకి నిశ్చితార్థం జరిగింది. గతంలో ఫాక్స్‌న్యూస్ హోస్ట్‌గా పనిచేసిన ఆమె.. అనంతరం పొలిటికల్ ఫండ్ రైజర్‌గా రాణించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ట్రంప్ తరఫున పలు ప్రచారాల్లో పాల్గొన్నారు. కాగా.. ఇప్పటికే ట్రంప్ తన కుమార్తె టిఫానీ మామ మాసాద్ బౌలోస్‌ను అరబ్, పశ్చిమాసియా వ్యవహారాల సీనియర్ సలహాదారుగా నియమించిన విషయం విదితమే. మరో వియ్యంకుడు ఛార్లెస్ కుష్నర్ (కుమార్తె ఇవాంక మామ) ను ఫ్రాన్స్‌కు రాయబారిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.