ట్రంప్ ఓ నియంత
హిట్లర్ కొన్ని మంచి పనులు చేశారన్న ట్రంప్ వ్యాఖ్యలపై కమలా హారిస్ ఫైర్. అతను నియంతలను అభిమానిస్తాడని మండిపడ్డారు.
నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలో దగ్గరపడుతున్న కొద్దీ రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయి చేరింది. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు క్రమంగా మతి తప్పుతున్నదని వ్యాఖ్యానించారు.
ఇటీవల యూఎస్ మెరైన్ జనరల్ జాన్ కెల్లీ ఓ మీడియాతో మాట్లాడుతూ.. 'హిట్లర్ కొన్ని మంచి పనులు చేశారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు మిలటరీ బదులుగా హిట్లర్ వంటి జనరల్స్ ఉండాలని ఆయన భావిస్తున్నారు' అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కమలా హారిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆరు మిలియన్ల మంది యూదులు, వేలాదిమంది అమెరికన్ల మరణాలకు కారణమైన వ్యక్తి హట్లర్. అలాంటి వ్యక్తిని ప్రశంసించడం ఆందోళన కలిగిస్తున్నది. ఇది చాలా ప్రమాదకరమైనది. అమెరికన్ ప్రజలకు ట్రంప్ ఎలాంటి వారు అనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం' అని హారిస్ పేర్కొన్నారు.
29న హారిస్ ప్రచార ముగింపు సభ
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో హారిస్ తన చివరి ఎన్నికల ప్రచార సభను ఈ నెల 29న నిర్వహించనున్నట్లు ప్రచార అధికారి పేర్కొన్నారు. అయితే 2021 జనవరి 6న జరిగిన అల్లర్లకు ముందు ట్రంప్ ర్యాలీ చేసిన చోటే ఆమె ప్రసంగిస్తారని తెలిపారు.