హెజ్‌బొల్లాపై దాడులను ఖండించిన ఐక్యరాజ్యసమితి
ఈ దాడులు అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకమని, దీన్ని యుద్ధ నేరంగా పరిగణించవచ్చని పేర్కొన్న యూఎన్
ఇప్పటివరకు పాలస్తీనాలోని హమాస్‌పై దృష్టి పెట్టిన ఇజ్రాయెల్ తాజాగా హెజ్‌బొల్లాను టార్గెట్ చేసుకున్నది. ఈ క్రమంలోనే ఇటీవల పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే హెజ్‌బొల్లా లక్ష్యంగా చేసిన దాడులను ఐక్యరాజ్యసమితి (యూఎన్) ఖండించింది. ఇజ్రాయిల్-హెజ్‌బొల్లా దాడుల నేపథ్యంలో యూఎన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకమని, దీన్ని యుద్ధ నేరంగా పరిగణించవచ్చన్నది.
హానిచేయని పోర్టబుల్ వస్తువుల్లో ట్రాప్ ఉపకరణాలు ఉపయోగించడం సరికాదని యూఎన్ మానవహక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడటం యుద్ధం కిందికే వస్తుందన్నారు. ఈ దాడుల్లో సాధారణ పౌరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని చెప్పారు. ఈ దాడులు యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తాయని అభిప్రాయపడ్డారు. కమ్యూనికేషన్ సాధానాలను ఆయుధాలుగా మార్చడాన్ని ఆయన ఖండించారు.
మరోవైపు హెజ్‌బొల్లాలో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల ఘటనపై యూఎన్‌లోని ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ స్పందించడానికి నిరాకరించారు. అయితే లెబనాన్‌లోని హెజ్‌బొల్లాతో యుద్ధం చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. ఈ దాడులను కొనసాగించలేమని కూడా డానన్ పేర్కొన్నారు.