Telugu Global
International

ఇప్పుడిక మా టైం..అరబ్ కంట్రీల్లో భర్తలకు విడాకులిస్తున్న భార్యలు

కొంతకాలంగా ఆ దేశాల్లో మహిళలు విడాకులు పొందే ప్రక్రియను సులభతరం చేయడంతో ఇప్పుడు విడాకులు తీసుకునే మహిళల సంఖ్య బాగా పెరిగింది.

ఇప్పుడిక మా టైం..అరబ్ కంట్రీల్లో భర్తలకు విడాకులిస్తున్న భార్యలు
X

అరబ్ దేశాల్లో మహిళలకు ఆంక్షలు ఎక్కువ. వారు ధరించే దుస్తులు, ఉన్నత విద్య చదవడంలో, ఇతర అంశాల్లో నిబంధనలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. చివరికి భర్తలు నచ్చకపోయినా మహిళలకు విడాకులు పొందటం అంత సులభం కాదు. అలాంటి చట్టాలు అక్కడ ఉన్నాయి. పురుషులు ఎంతమంది మహిళలను అయినా పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండగా.. మహిళలు మాత్రం కఠిన ఆంక్షల మధ్య ఉండాల్సి వస్తోంది. కాగా అరబ్ దేశాల్లో కొంతకాలంగా చట్టపరంగా మారిన నిబంధనల వల్ల తమకు నచ్చని భర్తల నుంచి విడాకులు తీసుకుంటున్న భార్యల సంఖ్య కొన్ని రెట్లు పెరిగింది. తాజాగా వెల్లడైన నివేదికలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

అరబ్ దేశాల్లో భర్తల నుంచి విడిపోతున్న భార్యల సంఖ్య భారీగా పెరిగినట్లు 'ది ఎకనామిస్ట్ ' మ్యాగజైన్ తాజా నివేదిక పేర్కొంది. గతంలో అరబ్ దేశాల్లో భర్త నచ్చకపోతే భార్య విడాకులు పొందడం సుదీర్ఘ ప్రక్రియ కావడంతో వారు విడాకులు తీసుకోవడానికి ముందుకు వచ్చేవారు కాదు. అయితే కొంతకాలంగా ఆ దేశాల్లో మహిళలు విడాకులు పొందే ప్రక్రియను సులభతరం చేయడంతో ఇప్పుడు విడాకులు తీసుకునే మహిళల సంఖ్య బాగా పెరిగింది.

ఈజిప్ట్ లో విడాకులు తీసుకునే మహిళల సంఖ్య రెట్టింపు అయినట్లు ది ఎకనామిస్ట్ మ్యాగజైన్ నివేదిక పేర్కొంది. అలాగే యూఏఈ, ఖతార్, లెబనాన్, జోర్డాన్ లలో మూడింట ఒక వంతు మంది విడాకులు తీసుకుంటున్నారు. ఇక కువైట్ లో సగానికి సగం పెళ్లిళ్లు విడాకులతో ముగుస్తున్నాయి.

సౌదీ అరేబియాలో గంటకు 7 విడాకుల చొప్పున, సగటున రోజుకు 162 విడాకుల కేసులు నమోదవుతున్నాయి. ట్యూనిషియాలో నెలకు 940 విడాకుల కేసులు, జోర్డాన్ లో ఏడాదికి 14 వేలు, అల్జీరియాలో ఏకంగా ఏడాదికి 64 వేల విడాకుల కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం విడాకుల ప్రక్రియలో మారిన నిబంధన వల్ల మొత్తం 22 అరబ్ దేశాల్లో భర్తల నుంచి విడాకులు తీసుకుంటున్న భార్యల సంఖ్య భారీగా పెరిగింది.

First Published:  21 Sept 2022 1:23 PM IST
Next Story