Telugu Global
International

శ్రీలంకకు తిరిగొచ్చిన గోటబయ రాజపక్సే... ఘన స్వాగతం పలికిన మంత్రులు

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశానికి తిరిగివచ్చాడు. ప్రజల ఆగ్రహానికి భయపడి దేశం వదిలి పారిపోయిన ఏడు వారాల తర్వాత ఆయన శుక్రవారం రాత్రి శ్రీలంలో అడుగుపెట్టారు.

శ్రీలంకకు తిరిగొచ్చిన గోటబయ రాజపక్సే... ఘన స్వాగతం పలికిన మంత్రులు
X

ప్రజల ఆగ్రహానికి భయపడి దేశం వదిలి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఏడు వారాల తర్వాత దేశానికి తిరిగి వచ్చారు.

శుక్రవారం అర్ధరాత్రి బ్యాంకాక్ నుండి సింగపూర్ మీదుగా కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రులు, ఎంపీలు పూలమాలలతో స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున సైన్యం కాన్వాయ్ తో ఆయన కొలొంబోలోని ప్రభుత్వం కేటాయించిన తన ఇంటికి చేరుకున్నారు.

జూలై 13న, గోటబయ, అతని భార్య, ఇద్దరు అంగరక్షకులు ప్రత్యేక విమానంలో మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. సింగపూర్ నుంచి అధికారికంగా తన రాజీనామా లేఖ పంపించి రెండు వారాల తర్వాత థాయ్‌లాండ్‌కు వెళ్లారు. అయితే తమ దేశంలో ఉండేందుకు థాయ్ లాండ్ ప్రభుత్వం ఆయనకు 90 రోజులు మాత్రమే అనుమతినిచ్చింది. అయితే ఆయన గడువుకు ముందే స్వదేశానికి వచ్చేశారు. రాజపక్సపై కోర్టు కేసులు గానీ, అరెస్ట్ వారెంట్ గానీ పెండింగ్‌లో లేవు. తన అన్న అధ్యక్షుడిగా రక్షణ మంత్రిత్వ శాఖకు కార్యదర్శిగా ఉన్న సమయంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై అతను ఎదుర్కొంటున్న ఏకైక కోర్టు కేసు రాజ్యాంగపరమైన మినహాయింపు కారణంగా 2019లో అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఉపసంహరించబడింది.

గోటబయకు వ్యతిరేకంగా తిరగబడ్డ శ్రీలంకప్రజలు, ఆయన దేశం విడిచి పారిపోయేదాకా నిద్రపోలేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ ఆయనను దేశంలోకి సాదరంగా ఆహ్వనించడాన్ని శ్రీలంక ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

First Published:  3 Sept 2022 11:16 AM IST
Next Story