తన బిడ్డలను తానే చంపి.. ఫ్రిజ్‌లో దాచిన తల్లి.. - ఏళ్ల తరబడి వెలుగుచూడని వైనం
అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. తొలుత పోలీసుల దర్యాప్తునకు ఆమె సహకరించలేదు. దీంతో సెర్చ్ వారెంట్ తీసుకొని వచ్చి ఆమె ఇంట్లో సోదాలు జరిపారు.
తనకు పుట్టిన బిడ్డలను తానే చంపి.. ఆ మృతదేహాలను ఫ్రిజ్‌లో కొన్ని సంవత్సరాల పాటు దాచి ఉంచిన ఘటన తాజాగా వెలుగుచూసింది. దక్షిణ కొరియాలో చోటుచేసుకున్న ఈ సంఘటనను అక్కడి పోలీసులు ఛేదించారు. దక్షిణ కొరియాలోని సువాన్ నగరానికి చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరి వయసు 8 నుంచి 12 ఏళ్ల మధ్య ఉంటుంది.
వీరు కాకుండా 2018లో ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. పుట్టిన మరుసటి రోజే ఆ బిడ్డను చంపి ఇంట్లోని ఫ్రిజ్‌లో పెట్టింది. తర్వాత 2019 నవంబర్‌లో మరో పాప పుట్టగా.. ఇదే దారుణానికి ఒడిగట్టింది. ఆస్పత్రిలో డెలివరీ అయినట్లు రికార్డులు ఉన్నప్పటికీ పుట్టిన తర్వాత పిల్లల పేర్లు ఎక్కడా నమోదు చేయకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆ ఏడాది మేలో అధికారులు ఆరా తీయగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
పోషించే స్థోమత లేదని..
అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. తొలుత పోలీసుల దర్యాప్తునకు ఆమె సహకరించలేదు. దీంతో సెర్చ్ వారెంట్ తీసుకొని వచ్చి ఆమె ఇంట్లో సోదాలు జరిపారు. ఆ క్రమంలోనే ఫ్రిజ్‌లో దాచి ఉంచిన రెండు మృతదేహాలు బయటపడ్డాయి. దీనిపై పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. ఆ హత్యలు తానే చేసినట్లు అంగీకరించింది.
పిల్లల్ని పోషించే ఆర్థిక స్థితి లేకపోవడంతోనే అలా ప్రాణాలు తీసినట్లు తెలిపింది. తన భార్య అబార్షన్ చేయించుకున్నట్లు చెప్పిందని.. అందుకే ఈ దారుణం గురించి తనకు తెలియదని భర్త పోలీసులకు చెప్పడం గమనార్హం.