ట్వీట్ పెట్టాలంటే.. ఫీజు క‌ట్టాలి | Soon You May Have To Pay To Use Twitter As Elon Musk Hints At Charging A Small Fee
Telugu Global
International

ట్వీట్ పెట్టాలంటే.. ఫీజు క‌ట్టాలి

ఎలాన్​ మస్క్​ భావిస్తున్నట్టుగా చాలా తక్కువ మొత్తమే ఛార్జ్​ చేసినా ఎక్స్​కు అది భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.

ట్వీట్ పెట్టాలంటే.. ఫీజు క‌ట్టాలి
X

ట్విట్టర్​లో సంస్కరణలు కొనసాగుతూనే ఉన్నాయి. ట్విట్టర్​ పేరును 'ఎక్స్​'గా మార్చటం మొదలుకొని, బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ ఇలా గత కొంతకాలంగా భారీ మార్పులు తీసుకొస్తున్నారు సంస్థ అధినేత ఎలాన్​ మస్క్​. ఇక ఇప్పుడు మరో భారీ మార్పు దిశగా ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నేతన్యాహూతో చర్చలు జరిపారు ఎలాన్​ మస్క్​. లైవ్​ స్ట్రీమింగ్​ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు పలు కీలక అంశాలపై చ‌ర్చించారు. సోషల్ మీడియా వేదికల్లో ద్వేషపూరిత ప్రసంగాలు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం బాట్స్​ అని, వీటిని నిరోధించాల్సిన అవసరం ఉంది అని నేతన్యాహూ అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన ఎలాన్​ మస్క్.. తాము కూడా ఆ దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా త్వరలో ఎక్స్​ ఖాతాదారులకు నెలవారీ సబ్​స్క్రిప్షన్ ఫీజు విధించనున్నామని పేర్కొన్నారు. ఎక్స్​లో ఉన్న బాట్స్​ సమస్యకు ఇది చక్కటి పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే ప్రస్తుతం ఎక్స్​కు ప్రతినెలా 550 మిలియన్​ మంది యాక్టివ్​ యూజర్లు ఉన్నారని, రోజువారీగా 100-200 మిలియన్​ పోస్టులు పెడుతున్నారన్నారు. ఎలాన్​ మస్క్​ భావిస్తున్నట్టుగా చాలా తక్కువ మొత్తమే ఛార్జ్​ చేసినా ఎక్స్​కు అది భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే.. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది..? ఎంత చెల్లించాలి..? అన్న వివరాలను మస్క్ వెల్లడించలేదు. .

ట్విట్టర్‌ను $44 బిలియన్లకు కొనుగోలు చేసిన తర్వాత, ఎలాన్ మస్క్ ఈ ప్లాట్‌ఫాంలో గణనీయమైన మార్పులు చేశాడు. లోగో, పేరు మార్చడంతో పాటు త్వరలో ఫోన్ నంబర్ లేకుండానే ఆడియా, వీడియో కాల్స్ మాట్లాడుకునే సదుపాయం కల్పించనున్నట్టు ప్రకటించాడు. అంతే కాదు గతంలో నిషేధించబడిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి వ్యక్తుల అకౌంట్స్ ను తిరిగి ఉపయోగించుకొనేలా చేశాడు. ప్రముఖ వ్యక్తుల అకౌంట్స్ గుర్తించే "బ్లూ టిక్" వెరిఫైడ్ సిస్టంను కూడా తొలగించాడు.

First Published:  19 Sept 2023 8:51 AM
Next Story