Telugu Global
International

రష్యా మూన్ మిషన్ ఫెయిల్‌.. కుప్పకూలిన లూనా - 25

లూనా-25ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే టైంలో లూనా -25 స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆటోమెటిక్‌ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి ఏర్పడింది.

రష్యా మూన్ మిషన్ ఫెయిల్‌.. కుప్పకూలిన లూనా - 25
X

చంద్రుడిపై పరిశోధనల కోసం ఆగస్టు 10న రష్యా ప్రయోగించిన లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్‌ కుప్పకూలింది. ఈ మేరకు ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్‌ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యేలా.. లూనా-25ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే టైంలో లూనా -25 స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆటోమెటిక్‌ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. తర్వాత లూనా-25 స్పేస్‌ క్రాఫ్ట్‌ అదుపుతప్పి చంద్రునిపై కుప్పకూలినట్లు సమాచారం.

దాదాపు 50 ఏళ్లు విరామం తర్వాత రష్యా చంద్రుడిపై పరిశోధనల కోసం లూనా-25ని ప్రయోగించింది. కేవలం 11 రోజుల్లోనే లూనా-25 చంద్రుడిపై ల్యాండ్ అయ్యేలా ఆ దేశ సైంటిస్టులు ప్లాన్ చేశారు. ఈ స్పేస్ క్రాఫ్ట్‌ చంద్రుడి దక్షిణ ధృవంలో సోమవారం సాఫ్ట్ ల్యాండ్ కావాల్సి ఉంది. చంద్రుని దక్షిణ ధృవంలోని క్రేటర్లలో నీరు ఉండొచ్చని రష్యన్ సైంటిస్టులు భావిస్తున్నారు. దీనిపై పరిశోధించడంతో పాటు చంద్రునిపై విలువైన మూలకాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలు తెలుసుకునేందుకు రష్యా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. శనివారమే చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన తొలి చిత్రాన్ని తీసి పంపించింది లూనా-25. చంద్రుడి అవతలి వైపు ఉండే ప్రాంతం భూమిపై నుంచి కనిపించదని.. ఆ ప్రాంతాన్నే లూనా-25 స్పేస్ క్రాఫ్ట్‌ ఫోటో తీసిందని రష్యన్‌ శాస్త్రవేత్త‌లు చెప్పారు. ఇక రష్యా చివరగా 1976లో తొలి లూనార్‌ ల్యాండర్‌ను ప్రయోగించింది. తన చివరి లునార్ మిషన్ లో చంద్రుడిపై ఉన్న 170గ్రాముల మట్టి శాంపిళ్లను భూమికి తీసుకురాగలిగింది రష్యా.

ఇక భారత్ సైతం చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ఇప్పటికే కీలక దశలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోయింది. అన్ని అనుకూలిస్తే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ అడుగు పెట్టనుంది. ఇక చంద్రయాన్‌ -3 తో పోల్చితే లూనా -25 బరువు తక్కువ. ఇంజిన్ సామర్థ్యం ఎక్కువ.

First Published:  20 Aug 2023 10:03 AM GMT
Next Story