బ్రిటన్ కోర్టులో నీరవ్ మోడీకి చుక్కెదురు..ఇక భారత్ కు రాక తప్పదు !
తనను భారత్ కు అప్పగించవద్దంటూ నీరవ్ మోడీ పలుమార్లు బ్రిటన్ కోర్టులను ఆశ్రయించాడు. అయితే వాటిని ఎప్పటికప్పుడు కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి. చివరి ప్రయత్నంగా ఆయన సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అనుమతించాలని లండన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు కోర్టు అనుమతించలేదు.
బ్యాంకులకు వేల కోట్లరూపాయల కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి బ్రిటన్ కోర్టులో చుక్కెదురైంది. తనను భారత్ కు అప్పగించే విషయంలో సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు లండన్ కోర్టు అనుమతించలేదు. దీంతో అతనిని చట్టపరంగా భారత్ కు రప్పించేందుకు మార్గం సుగమమైంది.
గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11వేల కోట్లరూపాయలు మేరకు మోసం చేశాడు. ఈ విషయాలు బయటికి రావడంతో 2018 లో దేశం విడిచి పరారయ్యాడు. 2019లో అతనిని లండన్ లో అరెస్టు చేశారు. అప్పటినుంచి జైలులోనే ఉంటున్నాడు. తనను భారత్ కు అప్పగించవద్దంటూ పలుమార్లు అక్కడి కోర్టులను ఆశ్రయించాడు.
అయితే వాటిని ఎప్పటికప్పుడు కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి. చివరి ప్రయత్నంగా ఆయన ఇదే విషయమై అక్కడి సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అనుమతించాలని లండన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని కోర్టు నిరాకరించడంతో ఆయనకు చట్టపరంగా దారులు మూసుకుపోయినట్టేనని భావిస్తున్నారు. త్వరలోనే ఆయనను భారత్ కు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.