మారిషస్‌లో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన
మారిషస్ జాతీయ దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మోడీ

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మారిషస్ చేరుకున్నారు. మారిషన్ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులాం స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోడీకి స్వాగతం పలికారు. అనంతరం మోడీ భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. మారిషస్ ప్రధాని స్వయంగా వచ్చి స్వాగతం పలకడంపై హర్షం వ్యక్తం చేసిన మోడీ వివిధ రంగాల్లో కొత్త సహకారానికి తన పర్యటన అద్భుతమైన అవకాశమని ట్వీట్ చేశారు. పోర్ట్ లూయీస్‌లో ప్రవాస భారతీయులతో ప్రధాని కరచాలనం చేశారు. ఈ సందర్భంగా బీహారీ సంప్రదాయ సంగీతమైన భోజ్‌పురి పాట 'గవాయి' ప్రవాసీలు స్వాగతం పలికారు. ప్రధానికి స్వాగతం పలికి ఆయనతో కరచాలనం చేయడం అద్భుతమైన అవకాశమని మారిషస్‌లో ఉంటున్న ప్రవాసీలు చెప్పారు. నవీన్ రామ్‌గులాం ఆహ్వానం మేరకు పర్యటిస్తున్న ప్రధాని మారిషస్ జాతీయ దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. భారత ఆర్థిక సహకారంతో నిర్మించిన సివిల్ సర్వీస్ కళాశాల, ఏరియా హెల్త్ సెంటర్ సహా 20 ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.