Telugu Global
International

ఐకానిక్‌ రూజ్‌వెల్ట్‌ను అద్దెకు ఇచ్చేసిన పాకిస్తాన్‌

పాక్‌ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టే చర్యల్లో భాగంగానే ఈ హోటల్‌ను లీజుకిచ్చారు. ఇప్పటికే రుణాల ఊబిలో ఉన్నపాకిస్తాన్‌ అప్పులు రానురాను మరింత పెరుగుతున్నాయి.

ఐకానిక్‌ రూజ్‌వెల్ట్‌ను అద్దెకు ఇచ్చేసిన పాకిస్తాన్‌
X

ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడేందుకు పాకిస్తాన్‌ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. పొదుపు చర్యలకు దిగింది. ఆస్తులను లీజుకిచ్చి డబ్బు సమీకరించే పనిలో ప‌డింది. ఇందులో భాగంగా న్యూయార్క్‌లోని ప్రముఖ రూజ్‌వెల్ట్‌ హోటల్‌ను లీజుకిచ్చింది. స్థానిక నగర పాలక సంస్థకే మూడేళ్ల పాటు అద్దెకు ఇచ్చేసింది. దీని ద్వారా 220 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని పొందనుంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్‌ వెల్ట్‌ పేరిట ఈ హోటల్‌ను నిర్మించారు. 1979లో ఈ హోటల్‌ను పాకిస్తాన్‌ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్ అద్దెకు తీసుకుంది. రెండు దశాబ్దాల తర్వాత ఏకంగా కొనుగోలు చేసింది. ఈ హోటల్‌లో మొత్తం 1,025 గదులున్నాయి. ఇప్పుడు అద్దెకు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది. మూడేళ్ల కాలం పూర్తయిన తర్వాత తిరిగి పాకిస్తాన్‌ ప్రభుత్వానికి హోటల్‌ను అప్పగిస్తారు. 1924 నుంచే ఈ హోటల్‌ న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌ ప్రాంతంలో ప్రధాన ల్యాండ్ మార్క్‌గా ఉంది.

పాక్‌ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టే చర్యల్లో భాగంగానే ఈ హోటల్‌ను లీజుకిచ్చారు. ఇప్పటికే రుణాల ఊబిలో ఉన్నపాకిస్తాన్‌ అప్పులు రానురాను మరింత పెరుగుతున్నాయి. అప్పులిచ్చే సంస్థలు కూడా దేశంలో అనేక పొదుపు, రాయితీల తొలగింపు వంటి చర్యలకు తీసుకుంటేనే అప్పులిస్తామని స్పష్టం చేస్తున్నాయి. పాక్‌ ప్రస్తుత అప్పు ఆ దేశ కరెన్సీలో రూ. 58.6 లక్షల కోట్లకు చేరింది.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి అప్పు 34.1శాతం పెరిగింది. ప్రతి నెల సరాసరి 2.6 శాతం మేర పాక్ అప్పు పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ధరలు ఆల్‌టైం రికార్డ్‌ దిశగా పయణిస్తున్నాయి. దీంతో అత్యంత కఠిన పరిస్థితుల నడుమ పాకిస్తాన్‌ ఆర్థికంగా నిలబడేందుకు పోరాటం చేస్తోంది. విదేశీ నిల్వలు నెల రోజుల దిగుమతులకు మాత్రమే సరిపోయే స్థాయికి పడిపోయాయి.

First Published:  7 Jun 2023 2:49 PM IST
Next Story