పాక్‌లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం.. - స్పష్టమైన మెజారిటీ ఎవరికీ దక్కని వైనం
నవాజ్ పేరుకు పీపీపీ ఒప్పుకోని పక్షంలో బిలావల్‌కు అవకాశమిచ్చేందుకు పీఎంఎల్ కూడా అంగీకరించే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు.
పాకిస్తాన్‌లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడనుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అక్కడ పోటీలో ఉన్న ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. దీంతో సంకీర్ణం దిశగా ఆయా పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. తాజా ఫలితాల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు అత్యధిక స్థానాలు సాధించి ప్రబలశక్తిగా నిలిచారు. ఇమ్రాన్‌ఖాన్ జైలుపాలవడమే గాక పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ ఎన్నికల గుర్తు రద్దవడంతో ఆయన మద్దతుదారులంతా ఈ ఎన్నికల్లో స్వతంత్రులుగా బరిలో నిలిచారు. వారికి ఏకంగా 100 స్థానాల్లో విజయం లభించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 133 సీట్లకు మాత్రం చాలా దూరంలో ఉండిపోయారు.
మరోపక్క మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్) పార్టీ 73 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇక బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 54 సీట్లలో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలూ అధికారం కోసం చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీల స్థానాలూ కలిపితే 127 అవుతున్నాయి. ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరో ఆరుగురి మద్దతు వారికి అవసరం. చిన్న పార్టీల, స్వతంత్రులు కలిపి 28 స్థానాల్లో గెలుపొందగా, వారి మద్దతు కోసం శనివారం నాడు జోరుగా మంతనాలు సాగించారు. నవాజ్ ప్రయత్నాలు ఫలిస్తే రికార్డు స్థాయిలో నాలుగోసారి పాక్ ప్రధాని అయ్యే అవకాశముంది. అయితే ప్రధానిగా బిలావల్‌కే అవకాశమివ్వాలని పలువురు పీపీపీ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తుండటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. కాకపోతే సైన్యం దన్ను నవాజ్‌కు ఉండటం ఆయనకు కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయన ఇచ్చిన పిలుపునకు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా మద్దతు పలకడం గమనార్హం.
నవాజ్ పేరుకు పీపీపీ ఒప్పుకోని పక్షంలో బిలావల్‌కు అవకాశమిచ్చేందుకు పీఎంఎల్ కూడా అంగీకరించే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు. మధ్యేమార్గంగా మరోసారి నవాజ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ పేరును ప్రధాని పదవికి ప్రతిపాదించవచ్చని చెబుతున్నారు. దీనికి సైన్యం నుంచి కూడా అభ్యంతరం ఉండకవపోచ్చన్నది రాజకీయ వర్గాల మాట. మొత్తం 265 జాతీయ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసి రెండు రోజులు దాటినా 10 చోట్ల ఇంకా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల వెల్లడి విపరీతంగా ఆలస్యమవుతుండటంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. నిజానికి తమకే మెజారిటీ సమకూరిందని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. కానీ అక్రమంగా ఫలితాలను పీఎంఎల్‌కు అనుకూలంగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే ఫలితాల వెల్లడిలో జాప్యం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.