Telugu Global
International

ఏ క్షణమైనా ప్రయోగించేలా 2100 అణ్వాయుధాలు సిద్ధం.. - సిప్రి తాజా నివేదికలో వెల్లడి

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయని ఆ సంస్థ తెలిపింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న తొమ్మిది దేశాలు తమ ఆయుధాలను మరింత ఆధునికీకరిస్తున్నాయని సిప్రి వెల్లడించింది.

ఏ క్షణమైనా ప్రయోగించేలా 2100 అణ్వాయుధాలు సిద్ధం.. - సిప్రి తాజా నివేదికలో వెల్లడి
X

ప్రపంచ వ్యాప్తంగా 2100 అణ్వాయుధాలు ఏ క్షణాన్నయినా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రముఖ అంతర్జాతీయ మేధో సంస్థ.. స్టాక్‌ హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) తాజాగా వెల్లడించింది. అవన్నీ రష్యా, అమెరికాకు చెందినవేనని తెలిపింది. తొలిసారి చైనా సైతం అణ్వస్త్రాలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచడం గమనించామని వెల్లడించింది. సోమవారం విడుదల చేసిన ‘సిప్రి ఇయర్‌ బుక్‌ 2024’లో ఈ విషయాలు పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అణ్వస్త్రాల్లో 90 శాతం రష్యా, అమెరికాకు చెందినవేనని సిప్రి నివేదిక వెల్లడించింది. 2023లో ఈ సంఖ్యలో పెద్దగా మార్పులేదని స్పష్టం చేసింది. రష్యా మాత్రం ప్రయోగానికి సిద్ధంగా ఉంచిన అణ్వాయుధాల సంఖ్యను పెంచుకున్నట్లు వెల్లడించింది. ప్రపంచంలో చైనా అత్యంత వేగంగా తమ అణ్వస్త్రాల సంఖ్యను పెంచుకుంటోందని సిప్రి కీలక అధికారి హాన్స్‌ క్రిస్టెన్‌సెన్‌ తెలిపారు. ఆ దేశం వద్ద 2023లో 410 ఆయుధాలు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 500 వరకు చేరినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దశాబ్దం చివరకు చైనా తమ ఖండాంతర క్షిపణుల సంఖ్యను అమెరికా లేదా రష్యాకు సమానంగా పెంచుకుంటుందని అంచనా వేశారు.


ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయని ఆ సంస్థ తెలిపింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న తొమ్మిది దేశాలు తమ ఆయుధాలను మరింత ఆధునికీకరిస్తున్నాయని సిప్రి వెల్లడించింది. కొన్ని దేశాలు 2023లో కొత్త ఆయుధ వ్యవస్థలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచాయని పేర్కొంది. 2024 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,121 అణ్వస్త్రాలు ఉన్నాయని సిప్రి తన నివేదికలో తెలిపింది. వీటిలో 9,585 ఆయుధాలు సైనిక నిల్వ కేంద్రాల్లో ఉన్నట్టు వివరించింది. ఇవన్నీ వినియోగానికి అందుబాటులో ఉన్నట్టేనని, దాదాపు 3,904 అస్త్రాలు క్షిపణులు, యుద్ధ విమానాల్లో అమర్చి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 60 వరకు పెరిగిందని తెలిపింది. వీటిలో దాదాపు 2,100 ఆయుధాలను ఏ క్షణమైనా ప్రయోగించేలా అత్యంత అప్రమత్తతతో ఉంచినట్టు నివేదిక స్పష్టం చేసింది.

ఇక భారత్‌ విషయానికొస్తే.. గత ఏడాదిలో చాలా స్వల్ప స్థాయిలో అణ్వాయుధాలను పెంచుకున్నట్టు సిప్రి తెలిపింది. భారత్, పాకిస్థాన్‌ ఇరు దేశాలు కొత్త అణ్వస్త్ర ప్రయోగ వ్యవస్థల అభివృద్ధిని కొనసాగించాయని పేర్కొంది. పాక్‌ ప్రధానంగా భారత్‌ను నిలువరించేందుకు వీలుగా అణ్వస్త్ర విధానాన్ని కొనసాగిస్తోందని తెలిపింది. భారత్‌ మాత్రం చైనాలో ఏ మూలకైనా ప్రయోగించగల ఆయుధాలపై దృష్టి సారించిందని పేర్కొంది. ప్రస్తుతం హమాస్‌తో యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఆధునికీకరిస్తోందని నివేదిక వెల్లడించింది. డిమోనాలో ఉన్న ప్లుటోనియం ఆధారిత రియాక్టర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ ఎప్పుడూ తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నట్టు అధికారికంగా ప్రకటించలేదు.

వివిధ దేశాల వద్ద ఉన్న అణ్వస్త్రాల సంఖ్య ఇదీ...

ప్రపంచంలో అణ్వస్త్ర సామర్థ్యమున్న తొమ్మిది దేశాల వద్ద అణ్వస్త్రాల సంఖ్యను ఈ సందర్భంగా సిప్రి వెల్లడించింది. అవి.. అమెరికా వద్ద 5,044, రష్యా 5,580, యూకే 225, ఫ్రాన్స్‌ 290, చైనా 500, భారత్‌ 172, పాకిస్థాన్‌ 170, ఉత్తర కొరియా 50, ఇజ్రాయెల్‌ వద్ద 90 అణ్వస్త్రాలు ఉన్నట్టు పేర్కొంది.

First Published:  17 Jun 2024 12:20 PM IST
Next Story