Telugu Global
International

నిజ్జర్ హత్య కేసు.. కెనడాకు ఇండియా ఘాటు రిప్లై

కెనడాలో భారత దౌత్య కార్యాలయాలు లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. అక్కడ పని చేసే వారికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇది సాధారణ స్థితిగా మేం పరిగణించాలా అని జైశంకర్ ప్రశ్నించారు.

నిజ్జర్ హత్య కేసు.. కెనడాకు ఇండియా ఘాటు రిప్లై
X

ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమ సానుభూతిపరుడు హర్‌దీప్ నిజ్జర్‌ను గుర్తు తెలియని దుండగులు కెనడాలో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక భారత ప్రభుత్వానికి చెందిన గూఢచారులు ఉన్నారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో మరోసారి కెనడాకు భారత ప్రభుత్వం ఘాటు రిప్లై ఇచ్చింది.

నిజ్జర్ హత్య విషయంలో కెనడా చేస్తున్న ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలు ఉంటే చూపాలని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై ఉదాసీన వైఖరే ఈ విషయంలో ప్రధాన సమస్య అని.. దాన్ని కెనడా పరిష్కరించుకోవల్సిన అవసరం ఉందని ఘాటుగా జవాబిచ్చారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల కోసం అమెరికా వెళ్లిన మంత్రి జైశంకర్ తాజాగా విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.

నిజ్జర్ హత్య ఉదంతంలో భారత గూఢచారుల హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. కెనడా వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉంటే తప్పకుండా దాన్ని పరిశీలించడానికి ఇండియా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ హత్య కేసు విషయంలో మేమేమీ తలుపులు మూసుకొని కూర్చోలేదు కదా.. కెనడా ఆ వివరాలు ఇస్తే పరిశీలిస్తాం కదా అని అన్నారు. నిజ్జర్ హత్య కేసు విషయంలో ఇరు దేశాల ప్రభుత్వాలు చర్చలు జరిపి విభేదాలు పరిష్కరించుకోవల్సిన అవసరం ఉందన్నారు.

కెనడాలో భారత దౌత్య కార్యాలయాలు లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. అక్కడ పని చేసే వారికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇది సాధారణ స్థితిగా మేం పరిగణించాలా అని జైశంకర్ ప్రశ్నించారు. మరో దేశానికి ఇలాంటి పరిస్థితే ఎదురైతే వాళ్లు ఎలా స్పందించే వారు? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో దౌత్యవేత్తలపై బెదిరింపులు ఏ మాత్రం ఆమోదయెగ్యం కాదని అన్నారు. కెనడా ప్రభుత్వంతో భారత్ చాలా కాలంగా సమస్యలు ఎదుర్కుంటోంది. అతివాదం, ఉగ్రవాదంపై వారి ఉదాసీన వైఖరే ఇక్కడ ప్రధాన సమస్య అని జై శంకర్ స్పష్టం చేశారు. భారత వ్యతిరేక శక్తులు కెనడాలో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్నది రహస్యమేమీ కాదని జైశంకర్ అన్నారు.


First Published:  30 Sept 2023 12:09 PM IST
Next Story