Telugu Global
International

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిసనాయకే ఎన్నిక

నేడు ప్రమాణం చేయనున్న మార్క్సిస్ట్‌ జనతా విముక్తి పెరమున పార్టీ నేత

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిసనాయకే ఎన్నిక
X

శ్రీలంక అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే ప్రమాణం చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే విజయం సాధించారు. మార్క్సిస్ట్‌ నేత అనుర కుమార దిసనాయకేకు శ్రీలంక ప్రజలు పట్టం కట్టారు. దీంతో దిసనాయకే శ్రీలంకకు 9వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కుమార దిసనాయకే విజయం సాధించిన నేపథ్యంలో దినేశ్‌ గుణవర్దెన ప్రధాని పీఠం నుంచి వైదొలిగారు.

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ శనివారం జరిగింది. ఆదివారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో దిసనాయకే అత్యధిక మెజారిటీ సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. పోలైన మొత్తం ఓట్లలో 42.31 శాతం ఓట్లు అనుర కుమార సాధించినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. రెండో స్థానంలో ఉన్న విపక్ష నేత సుజిత్‌ ప్రేమదాస కు 32.76 శాతం ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే మొదటిరౌండ్‌లోనే పోటీ నుంచి వైదొలిగారు. మరోవైపు లంక అధ్యక్ష ఎన్నికల్లో రెండో రౌండ్‌ లెక్కించే పరిణామం గతంలో ఎన్నడూ జరగలేదు. మొదటి ప్రాధాన్య ఓట్లలోనే విజేత ఎవరో తేలిపోయేది. ఆదివారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో విజయానికి అవసరమైన 50 శాతానికిపైగా ఓట్లు ఏ అభ్యర్థికి రాకపోవడంతో.. గెలుపు నిర్ధారించడానికి రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించగా.. అందులోనూ దిసనాయకే విజయం సాధించారు.

కలిసి పనిచేద్దామంటూ ప్రధాని మోడీ పిలుపు

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దిసనాయకేకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.విజన్‌ 'సాగర్‌' 'పొరుగు ప్రాధాన్యం'లో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉన్నదని పేర్కొంటూ కలిసి పనిచేద్దామంటూ ప్రధాని పిలుపునిచ్చారు. దీనిపై స్పందించిన దిసనాయకే మోడీ మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేద్దామని వ్యాఖ్యానించారు.

First Published:  23 Sept 2024 10:15 AM IST
Next Story