Telugu Global
International

నిరంకుశ పాలన త్వరలోనే ముగుస్తుందని నెతన్యాహు హెచ్చరిక

ఇజ్రాయెల్‌తో సుదీర్ఘ యుద్ధానికి తాము సిద్ధమని హెజ్‌బొల్లా ప్రకటన

నిరంకుశ పాలన త్వరలోనే ముగుస్తుందని నెతన్యాహు హెచ్చరిక
X

ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లాల మధ్య యుద్ధం తీవ్రతరమౌతున్నది. దీంతో పశ్చిమాసియా భగ్గుమంటున్నది. హెజ్‌బొల్లాలోని సరిహద్దుల్లోని శత్రు సైనికులను లక్ష్యంగా చేసుకొని దక్షిణ లెబనాన్‌లోని గ్రామాలపై దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ పేర్కొన్నది. మరోవైపు ఇరాన్‌ ప్రజలకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సంఘీభావ సందేశం పంపారు. నిరంకుశ పాలన త్వరలోనే ముగుస్తుంది అన్నారు. మీరు హెజ్‌బొల్లకు చెందిన హంతకులు, అత్యాచారం చేసేవారిని సమర్థించరని నాకు తెలుసు.. కానీ మీ నాయకులు అలా కాదని వ్యాఖ్యానించారు. అందుకే, ఇరాన్‌ కీలబొమ్మలను మేం ఒక్కొక్కటికీ పెకిలించివేస్తున్నాం. మా దేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామన్నారు. ఇలాంటి పాలకులు మీకు అక్కర్లేదు. త్వరలోనే ఆ నిరంకుశ పాలన నుంచి మీకు విముక్తి కల్పిస్తాం. అప్పడు రెండు దేశాల్లో మళ్లీ శాంతి నెలకొంటుందని నెతన్యాహు పరోక్షంగా ఇరాన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని హెజ్‌బొల్లా తెలిపింది.

ఇజ్రాయెల్‌తో సుదీర్ఘ యుద్ధానికి తాము సిద్ధమని హెజ్‌బొల్లా ప్రకటించింది. ప్రత్యర్థి భూతల దాడులు చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. సోమవారం హెజ్‌బొల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ నయీమ్‌ కాసిం టెలివిజన్‌లో ప్రసంగించాడు. అధినేత హసన్‌ నస్రల్లా మరణాంతరం హెజ్‌బొల్లా మొదటి స్పందన ఇదే. మృతి చెందిన సీనియర్‌ కమాండ్ల స్థానాలను కొత్త వారితో భర్తీ చేశామని తెలిపాడు.

హెజ్‌బొల్లాను ఉగ్రవాద సంస్థ కాదు

హెజ్‌బొల్లాను ఉగ్రవాద సంస్థగా ఇజ్రాయెల్‌ సంబోధించడాన్ని భారత్‌లోని ఇరాన్‌ రాయబారి ఇరాజ్‌ ఇలాహి తీవ్రంగా తప్పుపట్టారు. నరమేధం, రక్తపాతం, అమాయకులపై దాడులను సమర్థించుకోవడానికి ఇజ్రాయెల్‌ చెబుతున్న సాకు హెజ్‌బొల్లా అన్నారు. హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా మరణం ప్రపంచంలోని మానవాళికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది

పశ్రిమాసియాలో యుద్ధం తీవ్రమౌతున్న తరుణంలో మిత్రదేశం ఇజ్రాయెల్‌కు అమెరికాగా మద్దతుగా వ్యాఖ్యానించింది. దానిపై నేరుగా దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూఎస్‌ రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఇరాన్‌ను హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని పునరుద్ఘాటించారు.

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ సరిహద్దుల్లో 600 మంది భారతీయ సైనికులు

ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లాల మధ్య యుద్ధం తీవ్రతరమౌతున్నది. ఉద్రికత్తలు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌-లెబనాన్‌ సరిహద్దుల్లో 600 మంది భారతీయ సైనికులను మోహరించినట్లు సెంటర్‌ ఫర్‌ జాయింట్‌ వార్‌ ఫేర్‌ స్టడీస్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ మేనేజర్‌ అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్‌-లెబనాన్‌ సరిహద్దుల్లో 120 కి.మీ. బ్లూలైన్‌ వెంబడి 600 మంది భారతీయ సైనికులను మోహరించారు. మన సైనికుల భద్రత చాలా ముఖ్యమైంది. ఆ ప్రాంతం నుంచి మన సైన్యాన్ని వెనక్కి తీసుకోవడంపై భారత్‌ ఏపక్షంగా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే వారి శ్రేయస్సును తెలుసుకోవడానికి వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంటుందన్నారు. అలాగే పశ్చిమాసియాలో భారత్‌కు వ్యూహాత్మక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో రక్షణ రంగంలో మన సంబంధం ముఖ్యమైనది. ఈ వివాదంలో ఇరాన్‌ భారత్‌కు సంబంధించిన విషయాలను క్లిష్టతరం చేస్తుంది. మా కనెక్టివిటీ ప్రాజెక్టులు ముఖ్యంగా చాబహార్‌ పోర్టుకు ఇరాన్‌ కీలకం అన్నారు. ఈ యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగిస్తే అది నేరుగా భారత ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తుందని అశోక్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. వివాదం ఎదురయ్యే ఏవైనా సవాళ్లను ఎదుర్కోవడానికి భౌరత్‌ దౌత్యపరంగా నిమగ్నమై ఉండాలన్నారు.

First Published:  1 Oct 2024 11:01 AM IST
Next Story