Telugu Global
International

షింజో అబె వీడ్కోలు సభ ఎందుకింత ఆలస్యం.. ఇవ్వాళ హాజరుకానున్న ప్రధాని మోడీ

షింజో అబెకు అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలకడం అనేది జపాన్ చరిత్రలో అత్యంత అరుదైన సంఘటన. సాధారణంగా జపాన్‌లో రాజ కుటుంబానికి తప్ప ఎవరికీ అలాంటి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించరు.

షింజో అబె వీడ్కోలు సభ ఎందుకింత ఆలస్యం.. ఇవ్వాళ హాజరుకానున్న ప్రధాని మోడీ
X

జపాన్ మాజీ ప్రధాని షింజో అబె తుది వీడ్కోలు కార్యక్రమాన్ని మంగళవారం టోక్యోలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలు దేశాధినేతలు పాల్గొననున్నారు. షింజో అబె జూలై 9న ఓ ఎన్నికల ప్రచారంలో ఉండగా వెనుక నుంచి దుండగుడు కాల్పులు జరపడంతో మరణించారు. ఆ తర్వాత ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ దాదాపు 80 రోజుల ఆలస్యంగా ఇవ్వాళ ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలుకనున్నారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా జపాన్‌లో రాజకీయ నాయకులు రెండుగా విడిపోయారు. సుదీర్ఘకాలం జపాన్‌ను పాలించిన ప్రధానిగా అబెకు ఘనవైన నివాళి అర్పించాలని ఓ వర్గం వాదిస్తుండగా.. ఇంత వరకు ఏ రాజకీయ నాయకుడికి కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, వీడ్కోలు సభలు చేయలేదని మరో వర్గం వాదిస్తూ వచ్చింది. చివరకు జపాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోనే అబెకు తుది వీడ్కోలు పలకాలని నిర్ణయించింది.

షింజో అబెకు అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలకడం అనేది జపాన్ చరిత్రలో అత్యంత అరుదైన సంఘటన. సాధారణంగా జపాన్‌లో రాజ కుటుంబానికి తప్ప ఎవరికీ అలాంటి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించరు. రాజు హాజరైతేనే అవి అధికారిక లాంఛనాలతో నిర్వహించినట్లు గుర్తిస్తారు. రాజకీయ నాయకులు, సైనిక అధికారులు చనిపోయినా అధికారిక లాంఛనాలు ఉండవు. 1943లో ఇసురోకు యమమోటోకు తొలిసారిగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. రాజ కుటుంబానికి చెందని వ్యక్తి ఆ గౌరవం అందుకోవడం అదే తొలిసారి. పెరల్ హార్బర్ దాడి సమయంలో జపాన్ కమాండర్‌గా ఉండటంతో ఆయనకు ఆ వీడ్కోలు దక్కింది. రెండో ప్రపంచ యుద్దం తర్వాత జపాన్‌లో రాజ కుటుంబీకులకు తప్ప ఎవరికీ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం లేదు.

1967లో షిగేరు యోషిదాకు స్టేట్ ఫ్యునరల్ చేశారు. ఆధునిక జపాన్ చరిత్రలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయించుకున్న తొలి రాజకీయ నాయకుడు ఆయనే. శాన్‌ఫ్రాన్సిస్కో ఒడంబడిక మీద సంతకాలు చేసినందుకు గాను ఆయనకు ఆ గౌరవం లభించింది. ఆ తర్వాత ఇక ఏ నాయకుడికి కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేదు. జపాన్ ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమాల పట్ల వ్యతిరేకత కలిగి ఉంటారు. ప్రజాస్వామ్యం యొక్క స్పూర్తిని అధికారిక లాంఛనాలతో జరిపే కార్యక్రమాలు దెబ్బతీస్తాయని అక్కడి మేధావులు చెబుతుంటారు. కానీ, తాజాగా షింజో అబెకు అలాంటి హోదా దక్కనున్నది.

జపాన్‌ను సుదీర్ఘకాలం పాలించిన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా.. అనేక దేశాలతో స్నేహ సంబంధాలు మెరుగుపరచడంలో అబె కృషి ఎనలేదని. ఆయనను ఆధునిక జపాన్ నిర్మాతగా కూడా అభివర్ణిస్తుంటారు. అందుకే ఆయనకు ఘనమైన వీడ్కోలు అందించాలని నిర్ణయించినట్లు ప్రధాని కిషిద చెప్తున్నారు. కిషిదా కేబినెట్ కూడా ఈ మేరకు అధికారిక నిర్ణయం తీసుకున్నది. యూనిఫికేషన్ చర్చ్‌కు సంబంధించిన రాజకీయ నాయకులు కొందరు కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ ప్రజలు భావిస్తున్నారు. ఇటీవల ఈ నిర్ణయంపై నిరసనలు కూడా జరిగాయి. అబెకు ఆ చర్చ్‌తో సంబంధం ఉండటం వల్లే అధికారిక లాంఛనాలతో కార్యక్రమం నిర్వహిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.

మరోవైపు జపాన్ ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడానికి భారీ మొత్తంలో ఖర్చు చేయడానికి సిద్ధపడింది. దాదాపు 1.66 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నట్లు జపాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల చనిపోయిన క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు 1.30 బిలియన్ డాలర్లు ఖర్చుకాగా.. అబేకు అంతకు మించి ఖర్చు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. అబె సంస్మరణ సభ కోసం మురయామా అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు.

First Published:  27 Sept 2022 7:10 AM IST
Next Story