Telugu Global
International

గాజా స్వాధీనంపై ట్రంప్‌ ప్రణాళికను అమలుచేస్తాం

ఈ వారాంతంలో తమ బందీలను విడుదల చేయకపోతే .. యుద్ధం తిరిగి ప్రారంభమౌతుందని హెచ్చరించిన ఇజ్రాయెల్‌

గాజా స్వాధీనంపై ట్రంప్‌ ప్రణాళికను అమలుచేస్తాం
X

హమాస్‌ తన చెరలో ఉన్న బందీలను శనివారం నాటికి విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయెల్‌ కూడా డెడ్‌లైన్‌ విధించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ మరో కీలక ప్రకటన చేసింది. ఈ వారాంతంలో తమ బందీలను విడుదల చేయకపోతే .. యుద్ధం తిరిగి ప్రారంభమౌతుందని హెచ్చరించింది. ఈ విషయాలను ఆ దేశ రక్షణ మంత్రి కాట్జ్‌ వెల్లడించారు. కొత్త యుద్ధం మొదలవుతుంది. బందీలందరినీ విడిచిపెట్టేవరకు అది ఆగదు. గాజా స్వాధీనంపై ట్రంప్‌ ప్రణాళికను అమలు చేస్తామని కాట్జ్‌ పేర్కొన్నారు.

ఖతర్‌, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో గత నెల ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా.. హమాస్‌ తమ చెరలోని బందీలను విడుదల చేస్తుంది. ప్రతిగా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్‌ విడిచిపెడుతుంది. ఇప్పటివరకు పలు దఫాలుగా 21 మంది బందీలను మిలిటెంట్‌ సంస్థ విడుదల చేయగా...730 మంది పాలస్తీనా ఖైదీలను టెల్‌అవీవ్‌ విడిచిపెట్టింది. ఈ క్రమంలో తదుపరి విడుదల ప్రక్రియ శనివారం నిర్ణయించగా హమాస్‌ అనూహ్యమైన ప్రకటన చేసింది. కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తున్నదని ఆరోపిస్తూ.. బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌, ఇజ్రాయెల్‌లు ఆ సంస్థకు డెడ్‌లైన్‌ విధించాయి. బందీల విడుదలను ఆపితే హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేవరకు తమ బలగాలు పోరాడుతాయని నెతన్యాహూ ఓ వీడియోలో పేర్కొన్నారు. గాజా లోపల, వెలుపల బలగాలను సమీకరించాలని ఐడీఎఫ్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో కాల్పుల విరమణకు బీటలు వారడంతో మధ్య ప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటాయనే ఆందోళన వ్యక్తమౌతున్నది.

First Published:  13 Feb 2025 11:07 AM IST
Next Story