హనియాను చంపి ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసింది
ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవాని వ్యాఖ్య
హమాస్ రాజకీయ విభాగ అధిపతి ఇస్మాయెల్ హనియాను తామే చంపామని ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటనపై ఇరాన్ తాజాగా స్పందించింది. హనియాను చంపడం ఓ హేయమైన ఉగ్రవాద చర్యగా పేర్కొన్నది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవాని వ్యాఖ్యానించారు. ఈ క్రూరమైన నేరాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించింది. హనియాను చంపి ఇజ్రాయెల్ ఘోరమైన నేరానికి పాల్పడినందుకు దానికి ప్రతిగా తాము క్షిపణి దాడులు చేశాం. ఇది హేయమైన ఉగ్రవాద చర్య కిందికి వస్తుందన్నారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆ దేశ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న హనియా.. అదే నగరంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. హనియాను తామే అంతమొందించామని తాజాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ధృవీకరించారు. టెల్‌అవీవ్‌పై దాడులు చేస్తున్న హూతీలకు హెచ్చరికలు జారీ చేసేటప్పుడు ఈ విషయాన్ని ఆయన బైటపెట్టారు.
సిరాయాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని వీడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఈ క్రమంలో సిరియా నూతన విదేశాంగ శాఖ మంత్రి అసద్ హసన్ అల్ షిబాని ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. సిరియా ప్రజల ఇష్టాన్ని, దేశ సార్వభౌమాధికారాన్ని, భద్రతను టెహ్రాన్ గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాకుండా తమ దేశంలో ఎలాంటి గందరగోళం సృష్టించవద్దంటూ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇటీవల సిరియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్పందిస్తూ.. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసద్ ప్రభుత్వాన్ని కూల్చేసి.. భవిష్యత్తులో ఏర్పడే కొత్త పాలనను అక్కడి యువత కచ్చితంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సిరియా కొత్త ప్రభుత్వం హెచ్చరికలు చేసింది.