Telugu Global
International

ఇజ్రాయెల్‌పై ప్రతిదాడికి సిద్ధమౌతున్న ఇరాన్‌

ఇరాక్‌ భూభాగం నుంచి ఇరాన్‌ తన అనుకూల మిలిటెంట్ల ద్వారా దాడికి పాల్పడుతుందని భావిస్తున్న ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు

ఇజ్రాయెల్‌పై ప్రతిదాడికి సిద్ధమౌతున్న ఇరాన్‌
X

ఇరాన్‌ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ప్రతికారదాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు ప్రతిదాడి చేస్తామని టెహ్రాన్‌ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌పై ప్రతిదాడికి సిద్ధం చేయాలని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీఖమేని తన దళాలను ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు ఓ వార్తసంస్థ కథనాన్ని ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. ఇటీవల ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో జరిగిన నష్టం, ప్రతిదాడికి సంబంధించి ఇరాన్‌ అధికారులు చర్చలు నిర్వహించినట్లు సమాచారం. ఈ చర్చల సమయంలో జాతీయ భద్రతా మండలి రూపొందించిన ప్రణాళికలపై ప్రతిదాడికి సిద్ధం చేయాలని ఖమేనీ తన సైనికాధికారులను ఆదేశించినట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి. దీనిలోభాగంగా టెహ్రాన్‌ దళాలు టెల్‌ అవీవ్‌కు చెందిన సైనిక స్థావరాల జాబితాను రూపొందిస్తున్నట్లు కథనంలో పేర్కొన్నది. మరోవైపు ఇరాక్‌ భూభాగం నుంచి ఇరాన్‌ తన అనుకూల మిలిటెంట్ల ద్వారా దాడికి పాల్పడుతుందని ఇజ్రాయెల్‌ నిఘావర్గాలు భావిస్తున్నాయి.

ఐడీఎఫ్‌, భద్రతా సేవలకు నేను నిర్దేశించిన అత్యున్నత లక్ష్యం ఇరాన్‌ అణ్వాయుధాలను సాధించకుండా నిరోధించడమే. దీంతో టెహ్రాన్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఇరాన్‌ నాయకుల అహంకారపు మాటలు నేడు అక్కడి వాస్తవాన్ని కప్పిపుచ్చలేవు. మునుపటికంటే మాకు ఎక్కువ స్వేచ్ఛ ఉన్నది. మేము వారి భూభాగంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొన్నది.

అక్టోబర్‌ 1న టెల్‌అవీవ్‌పై సుమారు 200 కిపణులతో ఇరాన్‌ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇరాన్‌ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసిన ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో టెహ్రాన్‌కు చెందిన నలుగురు సైనికులు మృతి చెందగా.. క్షిపణి తయారీ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇరాన్‌ అప్పుడు హెచ్చరించింది. ఈ అంశాన్ని తీవ్రతరం చేయవద్దని పలు దేశాలు ఇరాన్‌కు సూచించాయి. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5న జరగనున్నాయి. దీనికి ముందే ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతిదాడి చేస్తుందని ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించడంతో పశ్చిమాసియాలో ఏం జరగబోతున్నదోనన్న ఆందోళన వ్యక్తమౌతున్నది.

First Published:  1 Nov 2024 11:09 AM IST
Next Story