Telugu Global
International

కుల వివక్ష వ్యతిరేక బిల్లును నిరసిస్తూ అమెరికాలో హిందూ సంఘాల ర్యాలీ

ఆ బిల్లును ఆమోదించవద్దని డిమాండ్ చేస్తూ కాలిఫోర్నియాలో హిందూ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఉత్తర అమెరికా హిందువుల కూటమి (CoHNA) ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. దాదాపు 100 నుంచి 150 మంది పాల్గొన్న ఈ ర్యాలీలో నిరసనకారులు కులవివక్షకు వ్యతిరేకంగా బిల్లును ఆమోదించవద్దని డిమాండ్ చేశారు.

కుల వివక్ష వ్యతిరేక బిల్లును నిరసిస్తూ అమెరికాలో హిందూ సంఘాల ర్యాలీ
X

భారతదేశంలో ఎన్ని చట్టాలు చేసినా కుల వివక్ష, కుల అణిచివేత ఆగడం లేదు. దళితులను అణిచివేయడం, దాడులు చేయడం, వివక్షకు గురి చేయడం ప్రతి రోజూ అతి మామూలుగా జరుగుతున్న వ్యవహారం. అయితే ఈ కుల గజ్జిని భారతీయులు విదేశాలకు కూడా తీసుకెళ్ళారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా భారతీయుల్లో ముఖ్యంగా హిందువుల్లో కుల వివక్ష జడలు విప్పుతోంది. ఈ మధ్య కాలంలో గూగుల్ సంస్థ‌ లో జరిగిన ఓ సంఘటన అమెరికాలో కుల వివక్ష‌కు అద్దం పడుతోంది. కుల వివక్షపై గొంతు విప్పిన ఓ మహిళ గూగుల్ లో హిందూ అగ్రకులాల ఒత్తిడి వల్ల ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో అమెరికాలో కుల వివక్షకు వ్యతిరేకంగా పని చేస్తున్న "ఈక్వాలిటీ ల్యాబ్స్ వంటి పలు సంఘాలు ఈ అంశంపై పోరాటాన్ని సాగిస్తున్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అమెరికాలోని సీటెల్ నగరం స్థానిక కౌన్సిల్ కుల వివక్షను చట్టవిరుద్ధం చేసింది. దీనిపైన అమెరికాలోని హిందూ సంఘాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి.

ఇప్పుడు సీటెల్ బాటలో కాలిఫోర్నియా పయనిస్తోంది. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం, ఆఫ్ఘన్ అమెరికన్ స్టేట్ సెనేటర్ ఐషా వహాబ్ మార్చి 22న కాలిఫోర్నియా సెనేట్‌లో కుల వివక్ష నిషేధం బిల్లును ప్రవేశపెట్టారు.

ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని జీర్ణించుకోలేని హిందూ సంఘాలు ఆవేశంతో రగిలిపోయాయి. ఆ బిల్లును ఆమోదించవద్దని డిమాండ్ చేస్తూ కాలిఫోర్నియాలో ర్యాలీ నిర్వహించాయి. ఉత్తర అమెరికా హిందువుల కూటమి (CoHNA) ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. దాదాపు 100 నుంచి 150 మంది పాల్గొన్న ఈ ర్యాలీలో నిరసనకారులు కులవివక్షకు వ్యతిరేకంగా బిల్లును ఆమోదించవద్దని డిమాండ్ చేశారు.

వారి జాతి, మతం, పూర్వీకులతో సంబంధం లేకుండా అందరికీ సమానత్వం, సమాన‌ న్యాయం అనే ప్రాథమిక సూత్రాలకు ఈ బిల్లు విరుద్ధంగా ఉందని హిందూ నిరసనకారులు ఆరోపించారు. .

కాగా, గత నెలలో చట్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, వహాబ్ విలేకరులతో మాట్లాడుతూ " కార్మికుల హక్కులు, మహిళల హక్కులు, పౌర హక్కుల కోసం ఈ చారిత్రక బిల్లును ప్రవేశపెడుతున్నాం " అని అన్నారు.

"సంస్థలు, కంపెనీలు తమ విధానాలలో కుల వివక్ష లేకుండా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాము. "కుల వివక్ష చూపడం కుల ఆధారిత వివక్ష చట్టానికి విరుద్ధం" అని ఆమె అన్నారు.

“కులం, మతం, జాతీయతకు అతీతమైనది. ఈ చట్టం లక్షలాది మందిని రక్షిస్తుంది. ” అని వహాబ్ అన్నారు.

First Published:  7 April 2023 9:29 AM IST
Next Story