నియంతృత్వ దేశాల లిస్ట్ లో భారతదేశం ... స్వీడన్ యూనివర్సిటీ రిపోర్ట్
గత పదేళ్ళలో ప్రపంచంలోని చాలా దేశాలు నియంతృత్వ బాటను పట్టాయని, కొన్ని దేశాలు పూర్తి స్థాయి నియంత్రుత్వ దేశాలుగా మారిపోయాయని V-డెమ్ నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి సాకుతో పలు దేశాలు అధికారాన్ని కేంద్రీకరించి నియంతృత్వ దేశాలుగా మారాయని ఆ నివేదిక తెలిపింది.
ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత దేశం నియంత్రుత్వం వైపు అడుగులు వేస్తోందా ? లేదా నియంతృత్వ దేశంగా మారిందా ? ఈ ప్రశ్నలకు జవాబు చెప్తోంది స్వీడన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్‌లోని V-డెమ్ (ప్రజాస్వామ్య రకాలు) ఇన్‌స్టిట్యూట్ కొత్త నివేదిక.
గత పదేళ్ళలో ప్రపంచంలోని చాలా దేశాలు నియంతృత్వ బాటను పట్టాయని, కొన్ని దేశాలు పూర్తి స్థాయి నియంత్రుత్వ దేశాలుగా మారిపోయాయని V-డెమ్ నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి సాకుతో పలు దేశాలు అధికారాన్ని కేంద్రీకరించి నియంతృత్వ దేశాలుగా మారాయని ఆ నివేదిక తెలిపింది. ఆ నివేదిక జాబితా చేసిన నియంతృత్వ దేశాల లిస్ట్ లో భారత్ కూడా ఉండటం ఆందోళనకలిగించే అంశం.
''2022 చివరి నాటికి, ప్రపంచ జనాభాలో 72% (5.7 బిలియన్ ప్రజలు) నిరంకుశ పాలనలో నివసిస్తున్నారు. అందులో 28% (2.2 బిలియన్ల ప్రజలు) "అత్యంత నియంతృత్వ పాలనలో ఉన్నారు. '' అని నివేదిక పేర్కొంది.
ఈ రోజు ప్రపంచంలో ఉదార ప్రజాస్వామ్యాల కంటే నిరంకుశ పాలనలే ఎక్కువగా ఉన్నాయని, ప్రపంచ ప్రజల్లో 13% మాత్రమే (సుమారు ఒక బిలియన్ ప్రజలు) ఉదారవాద ప్రజాస్వామ్యాలలో నివసిస్తున్నారని నివేదిక తెలిపింది.
35 దేశాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ క్షీణించింది. 47 దేశాలలో మీడియాపై ప్రభుత్వ సెన్సార్‌షిప్ పెరిగింది. 37 దేశాల్లో పౌర సమాజ ఆక్టివిస్టులపై దారుణమైన అణచివేత కొనసాగుతోంది. 30 దేశాలలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరగడం లేదు. అని నివేదిక తేల్చి చెప్పింది.
''గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా నిరంకుశ పాలకులు పెరిగిపోయారు. 2020లో COVID-19 మహమ్మారి విజృంభించినప్పుడు, మహమ్మారిని నియంత్రించే సాకుతో అధికారాన్ని కేంద్రీకరించడానికి, పార్లమెంటు అధికారాలను తగ్గించడానికి చాలా దేశాలు ప్రయత్నించాయి.ఆయా దేశాలు తమ పౌరుల హక్కులను రద్దు చేసే చట్టాలను ఆమోదించడానికి కరోనా మహమ్మారిని ఉపయోగించుకున్నాయి.'' అని నివేదిక తెలిపింది.
హంగరీలో ప్రెసిడెంట్ విక్టర్ ఓర్బన్ 2020లో డిక్రీ ద్వారా ఎన్నికలు లేకుండా పాలించే అధికారాన్ని పొందారు, ఈ విషయంలో అతనిపై తీవ్ర విమర్శలు రావడంతో అతను హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి నియంత్రుత్వ అధికారాలను చలాయించాడు.
యునైటెడ్ స్టేట్స్‌లో, కెంటుకీ రాష్ట్రం శిలాజ ఇంధన నిరసనలను నిషేధించింది. టెక్సాస్‌లోని ఒక ఫెడరల్ అప్పీల్ కోర్టు గర్భస్రావాలపై నిషేధాన్ని సమర్థించింది. ఇజ్రాయెల్‌లో, బెంజమిన్ నెతన్యాహు కోర్టులను సస్పెండ్ చేశారు.
ఈ ధోరణికి భారతదేశం మినహాయింపు కాదు. 2020లో ఆకస్మిక లాక్‌డౌన్ భారతీయ సమాజంలోని పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. వారి హక్కులను కూడా అనుమానంలో పడేసింది. V-Dem 2021, నివేదిక భారతదేశాన్ని "ఎన్నికల నిరంకుశత్వం"గా అభివర్ణించింది. అదే సంవత్సరంలో, ఫ్రీడమ్ హౌస్ భారతదేశాన్ని పాక్షిక స్వేచ్ఛ ఉన్న దేశంగా పేర్కొంది. అలాగే 2021లో, ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ తన గ్లోబల్ స్టేట్ ఆఫ్ డెమోక్రసీ (GSoD) నివేదికలో భారతదేశాన్ని ప్రజాస్వామ్యం అత్యంత వేగంగా క్షీణిస్తున్న దేశంగా పేర్కొంది.
గ్లోబల్ స్టేట్ ఆఫ్ డెమక్రసీ ఇన్షియేటీవ్(GSoD) నివేదిక ప్రకారం, భారత దేశంలో ప్రజాస్వామ్యం క్షీణిస్తూ ఉంది. 1975 ఎమర్జెన్సీ కాలం తర్వాత ప్రజాస్వామ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉండగా, 2020లో అది మళ్ళీ ఎమర్జెన్సీ కాలం స్థాయికి చేరింది.
2023 V-Dem నివేదిక భారతదేశాన్ని గత 10 సంవత్సరాలలో అత్యంత చెత్త నిరంకుశ దేశాలలో ఒకటి గా పేర్కొంది. లిబరల్ డెమోక్రసీ ఇండెక్స్‌లో భారతదేశం 40,50% దిగువకు పడిపోయింది. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల ర్యాంకులో భారత్ ర్యాంక్ 97. భారతదేశం ఎలక్టోరల్ డెమోక్రసీ ఇండెక్స్‌లో 108వ స్థానంలో ఉంది.
తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, ప్రజలను విభజించడం వంటి అంశాల్లో ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం, బ్రెజిల్, మయన్మార్లు ముందున్నాయని నివేదిక పేర్కొంది.
అయితే ప్రపంచం ఇంకా ప్రజాస్వామ్య ఆశలను కోల్పోలేదని, బొలీవియా, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, మోల్డోవా, డొమినికన్ రిపబ్లిక్, గాంబియా, మలావి తదితర దేశాలు మరింతగా ప్రజాస్వామ్యం వైపు మళ్ళుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది.