Telugu Global
International

ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్‌

భారత్‌, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. ఆరుగురు కెనెడా దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఈ నెల 19లోగా భారత్‌ వదిలి వెళ్లాలని వారికి సూచించింది.

ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్‌
X

కెనడాతో దౌత్యసంబంధాలపై అనిశ్చితి నెలకొన్న వేళ భారత్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆరుగురు కెనెడా దౌత్యవేత్తలను బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ నెల 19లోగా భారత్‌ వదిలి వెళ్లాలని వారికి సూచించింది. మరోవైపు కెనడాలోని భారత్‌ దౌత్యవేత్తలను వెనక్కి రప్పించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో భారత రాయబారులపై కెనడా ఆరోపణలు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రభుత్వంపై నమ్మకం లేదని, అక్కడి భారత రాయబారుల భద్రతపై అనుమానాలు ఉన్నాయని భారత విదేశాంగశాఖ చెబుతున్నది.

భారత్‌, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. దీనికి సంబంధించి సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసులో ఇటీవల భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మసహా పలువురు దౌత్యవేత్తలను పర్సన్‌ ఆప్‌ ఇంట్రెస్ట్‌లుగా(అనుమానితులుగా) కెనడా పేర్కొన్నది. దీన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు కెనడా ప్రభుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలకు అద్దం పడుతున్నాయని తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కెనడాలోని తన హైకమిషనర్‌, ఇతర దౌత్యవేత్తలు, అధికారులను వెనక్కి రప్పించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. తమ దౌత్యవేత్తలకు భద్రత కల్పించే విషయంలో ట్రూడో ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై అంతకుముందు భారత్‌లోని కెనడా రాయబారి స్టీవర్ట్‌ వీలర్‌ కు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత హైకమిషనర్‌, ఇతర దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని ఆ దౌత్యాధికారికి స్పష్టం చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ట్రూడో సర్కార్‌ ఇస్తున్న మద్దతుకు ప్రతిస్పందన తగిన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉన్నదని పేర్కొన్నది.

First Published:  14 Oct 2024 10:38 PM IST
Next Story