ఉక్రెయిన్ యుద్ధ రహస్యాలను బయటపెట్టిన అమెరికన్ అరెస్టు
తనకు దొరికిన సమాచారాన్ని జాక్ పలు ఆన్‌లైన్ చాట్ రూమ్స్‌లో షేర్ చేశాడు. గేమింగ్ కోసం ఉపయోగించే ఆ చాట్ రూమ్‌లో కొన్ని నెలలుగా కీలక సీక్రెట్ ఇన్ఫర్మేషన్‌ను పంచుకుంటున్నాడు.
ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన పలు రహస్య పత్రాలు అమెరికా వద్ద ఉన్నాయి. అమెరికా మిలిటరీ ఇంటెలిజెన్స్ సమాచారం చాలా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంటాయి. వాటని యాక్సెస్ చేయడానికి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే జాక్ టెక్సేరియా అనే ఎయిర్‌గార్డు ఈ కీలక సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా లీక్ చేశాడు. అతడి వయసు కేవలం 21 ఏళ్లు. యుద్ధ రహస్యాలను లీక్ చేసిన నేరంపై అతడిపై దేశద్రోహం కింది కేసు పెట్టారు. తాజాగా జాక్ టెక్సేరియాను దిగ్టన్ పట్టణంలో ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. మసాచుసెట్స్‌లోని బోస్టన్ కోర్టులో ఇవాళ జాక్‌ను హాజరుపరిచే అవకాశం ఉన్నది.
మాసాచుసెట్స్ నేషనల్ గార్డులో ఉన్న ఇంటెలిజెన్స్ వింగ్‌లో ఎయిర్‌గార్డు హోదాలో ఐటీ స్పెషలిస్టుగా టెక్సేరియా పని చేస్తున్నాడు. ఇతడు పని చేసే ఇంటెలిజెన్స్ విభాగం అత్యంత కీలకమైనది. అమెరికా ఎయిర్‌ఫోర్స్ దాడులు చేసే ముందు.. డ్రోన్ల ద్వారా ఇక్కడ నుంచే సమాచారాన్ని సేకరిస్తారు. ఇరాక్, సిరియా వంటి చోట్ల పని చేస్తున్న సైన్యానికి అవసరమైన సహాయక కార్యక్రమాలు కూడా ఈ విభాగం అందిస్తోంది. అత్యంత రహస్యమైన ఆపరేషన్లకు వెళ్లే వారికి ఇక్కడి నుంచి అవసరమైన సమాచారం లభిస్తుంది.
నాటోలో పని చేసే అమెరికా జనరల్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్ బ్యూరోక్రాట్లకు అవసరమైన కీలక సమాచారం ఈ కేంద్రం నుంచే వెళ్తుంది. ఈ ఇంటెలిజెన్స్ కేంద్రంలో పని చేసే వారికి అమెరికాకు చెందిన అత్యంత సీక్రెట్ డాక్యుమెంట్స్ చూసే అవకాశం ఉంటుంది. అమెరికా సైన్యంలో పనిచేసే 600 మందికి టాప్ సీక్రెట్ డాక్యుమెంట్స్ క్లియరెన్స్ ఉన్నది. వాళ్ల సహాయకులకు కూడా ఈ అవకాశం ఉన్నది. ఈ క్రమంలోనే ఇంటిలిజెన్స్‌లో అతి చిన్న హోదాలో పనిచేస్తున్న జాక్‌కు మిలటరీ సమాచారం యాక్సెస్ చేసే అవకాశం లభించింది.
తనకు దొరికిన సమాచారాన్ని జాక్ పలు ఆన్‌లైన్ చాట్ రూమ్స్‌లో షేర్ చేశాడు. గేమింగ్ కోసం ఉపయోగించే ఆ చాట్ రూమ్‌లో కొన్ని నెలలుగా కీలక సీక్రెట్ ఇన్ఫర్మేషన్‌ను షేర్ చేశాడు. ఆ తర్వాత కొంత మంది ఈ రహస్యాలను డిస్కార్డ్ అనే సోషల్ మీడియా వేదికలో బహిరంగంగా షేర్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పెంటగాన్ అధికారులు దర్యాప్తు చేసి.. అసలు నిందితుడు జాక్‌గా తేల్చారు. ఇది జాతీయ భద్రతకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వం అంచనా వేస్తోంది. కీలకమైన ఇంటెలిజెన్స్ సమాచారం బయటకు రావడంతో ఆ దేశం అవమానకరంగా భావిస్తోంది. కాగా, జాక్‌కు అత్యంత కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.