శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిసానాయకేకు భారీ ఆధిక్యం
ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకుపోతున్న ఎన్‌పీపీ నేత
శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) పార్టీ నేత అనుర కుమార దిసనాయకే భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు వరకు ప్రకటించిన ఫలితాల్లో దిసనాయకే 7,27,00 (52 శాతం) ఓట్లు సాధించారు. సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస 3,33,000 (23 శాతం) ఓట్లతో రెండో స్థానంలో ఉండగా.. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే 2,33,00 (16 శాతం) మూడో స్థానానికి పడిపోయారు. అలాగే 22 పోస్టల్ జిల్లాల ఓట్లలో 21 దిసానాయకే గెలుచుకోవడం విశేషం.
అధ్యక్ష ఎన్నికల్లో ఘోర ఓటమిని ఇంకా రణిల్ విక్రమ సింగే అంగీకరించలేదు. దీనిపై ఆయన ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఆయన ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి అలీ సబ్రి మాత్రం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆధిక్యంలో దూసుకుపోతున్న అసుర కుమార దిసానాయకేకు అభినందనలు తెలిపారు. 'సుదీర్ఘమైన ఎన్నికల ప్రచారం తర్వాత ఫలితాలు స్పష్టంగా వచ్చాయి. నేను అధ్యక్షుడు విక్రమసింఘే కోసం భారీగా ప్రచారం చేశాను. శ్రీలంక ప్రజలు దిసానాయకేకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును నేను పూర్తిగా గౌరవిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. దిసానాయకే ఆయన బృందానికి నా హృదయపూర్వక అభినందనలు' అని ఎక్స్‌లో అలీ సబ్రి పోస్ట్ చేశారు. మరోవైపు ప్రతిపక్ష నేత ప్రేమదాస పార్టీకి చెందిన హర్ష డిసిల్వా కూడా దిసానాయకేను అభినందించారు.