Telugu Global
International

ఇక యుద్ధాలు అణ్వాయుధాలతో కాదు.. ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో..

యుద్ధంలో కృత్రిమ మేధ వినియోగం గురించి జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. కంప్యూటర్లు వేగంగా పనిచేస్తాయి కాబట్టి వాటిలో మానవులు జోక్యం చేసుకోలేరని చెప్పారు.

ఇక యుద్ధాలు అణ్వాయుధాలతో కాదు.. ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో..
X

అణ్వాయుధ పోటీకి స‌మానంగా భ‌విష్య‌త్తులో ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI) పోటీ కూడా చేరుకుంటుంద‌ని `అవతార్` చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వాటిని మనం త్వరగా అభివృద్ధి చేయకపోతే వేరెవరో ముందుంటారనే అభిప్రాయంతో పోటీ పెరుగుతుంద‌ని వివ‌రించారు. తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. కృత్రిమ మేధతో 'ఆయుధీకరణ' చేస్తే అది విపత్కర పరిణామాలకు దారి తీస్తుందని తాను న‌మ్ముతున్నాన‌ని ఆయ‌న తెలిపారు.

కృత్రిమ మేధ పరిణామాల గురించి 1984లోనే తాను సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో 'ద టెర్మినేటర్' తెరకెక్కించానని తెలిపారు. ఆ సినిమా ఓ హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. ఈ కథ స్కైనెట్ అనే సూపర్ కంప్యూటర్ సృష్టించిన సైబర్నెటిక్ హంతకుడి చుట్టూ తిరుగుతుంది. కృత్రిమ మేధను ఆయుధీకరిస్తే అది మరింత ప్రమాదకరంగా మారుతుందని జేమ్స్ కామెరూన్ అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ మానవ జాతి మనుగడపై ప్రభావం చూపిస్తుందని ఇటీవల కొందరు వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దానిపై జేమ్స్ స్పందిస్తూ 'నేను వారి ఆందోళనతో ఏకీభవిస్తున్నాను. 1984లోనే నేను హెచ్చరించాను కానీ, మీరు పట్టించుకోలేదు' అంటూ తాను చిత్రీకరించిన 'ద టెర్మినేటర్' చిత్రాన్ని గుర్తుచేశారు.

యుద్ధంలో కృత్రిమ మేధ వినియోగం గురించి జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. కంప్యూటర్లు వేగంగా పనిచేస్తాయి కాబట్టి వాటిలో మానవులు జోక్యం చేసుకోలేరని చెప్పారు. అప్పుడు శాంతి చర్చలు, యుద్ధ విరమణ అవకాశాలు లేకుండా పోతాయన్నారు. అటువంటి ఏఐలను నియంత్రించాలంటే 'డీ ఎస్కలేషన్' పై దృష్టి సారించాలని కామెరూన్ సూచించారు. కానీ, కృత్రిమ మేధ వ్యవస్థ అలాంటి సూత్రాలకు కట్టుబడి ఉంటుందా అనే సందేహం వ్యక్తం చేశారు. జేమ్స్ కామెరూన్ గతంలోనూ ఇలాంటి ఆందోళలను వ్యక్తం చేశారు.

First Published:  22 July 2023 7:54 AM IST
Next Story