ప్లాన్ బైటపడటంతోనే ఇజ్రాయెల్ పేజర్లను పేల్చేసిందా?
హెజ్‌బొల్లా పేజర్లలో ఏదో తేడా ఉన్నట్లు గుర్తించడంతో.. తమ ప్లాన్ విఫలం కాకూడదని ఇజ్రాయెల్ పేజర్ల పేల్చివేతకు పాల్పడినట్లు ఆ దేశానికి చెందిన జెరుసలెం పోస్టు పత్రిక వెల్లడి.
హెజ్‌బొల్లా పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ ప్లాన్ లీక్ భయం కూడా దాగి ఉన్నట్లు సమాచారం. తాజాగా ఆ దేశానికి చెందిన జెరుసలెం పోస్టు పత్రిక ఆదివారం కీలకాంశాలతో ఒక కథనాన్ని ప్రచురించింది. హెజ్‌బొల్లా పేజర్లలో ఏదో తేడా ఉన్నట్లు గుర్తించడంతో.. తమ ప్లాన్ విఫలం కాకూడదని ఇజ్రాయెల్ పేజర్ల పేల్చివేతకు పాల్పడింది. దీనికి ప్రధాని నెతన్యాహూ హడావుడిగా అనుమతిచ్చారు. యుద్ధ క్షేత్రాన్ని గాజా నుంచి లెబనాన్ వైపు మార్చడంలో భాగంగా చేపట్టిన చర్యగా జెరుసలెం పోస్టు వెల్లడించింది.లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీ పేలుళ్ల ఘటనలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. సుమారు 500మంది దాకా గాయపడ్డ సంగతి తెలిసిందే.
హమాస్ లీడర్ యహ్యా సిన్వర్ మృతి!
గాజాలో శనివారం స్కూల్‌పై ఇజ్రాయెల్ జరిపిన రాకెట్ దాడిలో హమాస్ లీడర్ యహ్యా సిన్వర్ మృతి చెందినట్లు సమాచారం. రాకెట్ దాడిలో ఆయన చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నది. ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నది. హమాస్ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. ఈ దాడిలో 22 మంది మహిళలు, చిన్నారులు, చనిపోయారని పాలస్థీనా ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో ఖలీద్ ఇబ్న్ అల్ వాలీద్ పాఠశాలలో హమాస్ కమాండ్ సెంటర్ ధ్వంసమైంది. ఐటీఎఫ్ ఈ విషయాన్ని ధృవీకరించింది.
ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ అందువల్లే కూలిపోయి ఉండొచ్చు
మరోవైపు లెబనాన్‌లో పేజర్లు పేలుతున్న ఘటనలపై ఇరాన్ ఎంపీ అహ్మద్ బక్షయేష్ అర్దెస్తానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మే నెలలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనను పేజర్ల పేలుళ్లతో ముడిపెట్టారు. రైసీ దగ్గర కూడా పేజర్ ఉండేదని, హెలికాప్టర్ అందువల్లే కూలిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. హెజ్‌బొల్లా దళాలు ఉపయోగించిన పేజర్లతో పోలిస్తే ఇబ్రహీం రైసీ వద్ద భిన్నమైన పేజర్ ఉన్నట్లు వెల్లడించారు.
పాలస్తీనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ
గాజాలోని మానవతా పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలకు భారత్ నుంచి నిరంతర మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. కువైట్ యువరాజు షేక్ సబహ్ భలేద్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలితోనూ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే పలువురు భారతీయ మూలాలున్న సీఈవోలతోనూ మోడీ సమావేశమయ్యారు.