10 సెకన్లే తాకాడట.. నేరంగా పరిగణించడం అనాలోచితమే అవుతుందట..! - లైంగిక వేధింపుల కేసులో ఓ కోర్టు వివాదాస్పద తీర్పు
కోర్టు విచారణలో నిందితుడు తాను విద్యార్థినిని తాకిన మాట నిజమేనని అంగీకరించాడు. తాను సరదాగానే అలా చేశానని కోర్టుకు వివరించాడు. వాదోపవాదాల అనంతరం న్యాయస్థానం తాజాగా అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.
లైంగిక వేధింపుల కేసులో ఇటలీలోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. ఈ కేసులో నిందితుడు ఫిర్యాదు చేసిన విద్యార్థినిని 10 సెకన్ల కంటే తక్కువ సమయమే తాకాడని పేర్కొంటూ అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఇప్పుడు ఈ తీర్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రోమ్ నగరానికి చెందిన ఓ విద్యార్థిని (17) స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. ఆ స్కూల్‌లో కేర్ టేకర్‌గా పనిచేస్తున్న ఆంటోనియో అవోలా (66) తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధిత బాలిక గతేడాది ఏప్రిల్‌లో పోలీసులను ఆశ్రయించింది. ఘటన జరిగిన రోజు తన స్నేహితురాలితో కలిసి పాఠశాలలో మెట్లెక్కుతుండగా ఆంటోనియో తన వెనుక భాగంపై చేతులతో తడిమి.. తన లోదుస్తులను కిందకు లాంగేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతటితో ఆగక తనను పైకెత్తాడని తెలిపింది. తాను భయపడిపోవడంతో జోక్ చేశానని అక్కడి నుంచి వెళ్లిపోయాడని వివరించింది.
ఈ ఘటనపై కోర్టు విచారణలో నిందితుడు తాను విద్యార్థినిని తాకిన మాట నిజమేనని అంగీకరించాడు. తాను సరదాగానే అలా చేశానని కోర్టుకు వివరించాడు. వాదోపవాదాల అనంతరం న్యాయస్థానం తాజాగా అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కామవాంఛతో తాను ఈ పనిచేయలేదని, కేవలం సరదాగా చేశానని నిందితుడు చెప్పిన వాదనను న్యాయస్థానం అంగీకరిస్తోందని, అంతేగాక.. బాలికను అతడు కేవలం 5 నుంచి 10 సెకన్ల లోపు మాత్రమే తాకాడు కాబట్టి దీన్ని నేరంగా పరిగణించడం అనాలోచితమే అవుతుందని పేర్కొంది. ఇప్పుడు ఈ తీర్పుపై ఆ దేశంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.