పాకిస్తాన్ బడ్జెట్‌లో సగం అప్పులకే..!
ఈ ఏడాది చివర్లో పాకిస్తాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 950 బిలియన్ పాక్ రూపాయలను దేశంలో పలు అభివృద్ధి పనులకు కేటాయించింది.
పాకిస్తాన్ 2023-24 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. 14.5 ట్రిలియన్ పాక్ రూపాయల (సుమారు 50.5 మిలియన్ డాలర్లు) బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, అందులో 7.3 ట్రిలియన్ పాక్ రూపాయలను అప్పులు చెల్లించేందుకే కేటాయించడం గమనార్హం. ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పాకిస్తాన్‌లో గత కొంతకాలంగా ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో అక్కడి రూపాయి విలువ పడిపోయి నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో దేశంలో పారిశ్రామికోత్పత్తి క్షీణించింది.
ఈ ఏడాది చివర్లో పాకిస్తాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 950 బిలియన్ పాక్ రూపాయలను దేశంలో పలు అభివృద్ధి పనులకు కేటాయించింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం కేటాయింపులు ఈ దఫా 35 శాతం పెరగ్గా, పెన్షన్ల కోసం కేటాయించే మొత్తం 17.5 శాతం పెరిగింది. పాక్ ప్రస్తుతం అనుభవిస్తున్న దుస్థితికి గత పాలకులే కారణమని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు.
రక్షణ రంగానికి కేటాయింపులు పెంపు..
ఈ బడ్జెట్లో పాక్ రక్షణ రంగానికి గతేడాది కంటే 15.5 శాతం ఎక్కువగా నిధులు కేటాయించింది. గతేడాది 1.5 ట్రిలియన్ పాక్ రూపాయలు కేటాయించగా, ఈ బడ్జెట్లో 1.8 ట్రిలియన్ పాక్ రూపాయలు కేటాయించింది. అప్పుల చెల్లింపుల తర్వాత బడ్జెట్లో ఎక్కువ మొత్తం కేటాయింపులు చేసింది రక్షణ రంగానికే కావడం గమనార్హం.