కెనడాపై డబుల్ టారిఫ్‌ల విషయంలో ట్రంప్ పీచేమూడ్
కెనడాకు చెందిన ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటనపై వెనక్కి

అమెరికా, కెనడాల మధ్య పరస్పర సుంకాల యుద్ధం కొనసాగుతున్నది. అమెరికా సరఫరా చేసే విద్యుత్‌పై 25 శాతం అదనపు రుసుం వసూలు చేస్తామని ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ పేర్కొనడంతో.. కెనడాకు చెందిన ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. కాగా ప్రస్తుతం ఈ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అమెరికాలోని పలు రాష్ట్రాలపై విద్యుత్ ధరల పెంపును కెనడా ఉప సంహరించుకున్న నేపథ్యంలో సుంకాలపై ట్రంప్ వెనక్కి తగ్గుతున్నట్లు అమెరికా ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 25 శాతం టారిఫ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాలోని మూడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న విద్యుత్‌పై ఎగుమతి సుంకాలను 25 శాతం పెంచుతున్నట్లు కెనడాలోని ఒంటారియో ప్రకటించింది. దానికి ప్రతీకారంగా కెనడాకు చెందిన ఉక్కు, అల్యుమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు తాజాగా ప్రకటించారు. కాగా యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తో చర్చల తర్వాత విద్యుత్ 25 శాతం అదనపు రుసుం వసూలు చేయాలనే ప్రణాళికలను విరమించుకున్నట్లు ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్ట్ వెల్లడించారు. ఈ విషయంలో ఇరువర్గాల ప్రయోజనాలపై అమెరికా చర్చలు జరపడానికి ఫెడరల్ ఆర్థికమంత్రి డొమినిక్ లెబ్లాంక్‌తో కలిసి గురువారం వాషింగ్టన్ వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.