బ్రిటన్ ప్రధానిగా రిషి సూనక్ వద్దంటున్న బోరిస్ జాన్సన్.. 'జాతి వివక్ష' ?
బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సూనక్ వద్దని ఆపద్ధర్మ ప్రధాని బోరిస్ జాన్సన్ అంటున్నారు. ఆయన తప్ప.. మరెవరినైనా సరే ఈ పోస్టుకు ఎంపిక చేయాలని ఆయన కన్సర్వేటివ్ నాయకత్వానికి సూచించినట్టు తెలుస్తోంది.
బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సూనక్ వద్దని ఆపద్ధర్మ ప్రధాని బోరిస్ జాన్సన్ అంటున్నారు. ఆయన తప్ప.. మరెవరినైనా సరే ఈ పోస్టుకు ఎంపిక చేయాలని ఆయన కన్సర్వేటివ్ నాయకత్వానికి సూచించినట్టు తెలుస్తోంది. సూనక్ అభ్యర్థిత్వానికి మద్దతునివ్వరాదని ఆయన కోరుతున్నారు. కొన్ని నెలలుగా సూనక్ తన నాయకత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని తన ప్రభుత్వం పడిపోవడానికి ఆయనే కారణమని జాన్సన్ ఆరోపించినట్టు బ్రిటన్ లోని 'ది టైమ్స్' పత్రిక పేర్కొంది. ప్రధాని పదవికి రేసులో ఏ అభ్యర్థినైనా ప్రకటించేందుకు ఆయన నిరాకరిస్తున్నా.. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ లేదా వాణిజ్య శాఖ సహాయ మంత్రి పెన్నీ మార్డాంట్ బెటర్ అని భావిస్తున్నారట.. కన్సర్వేటివ్ పార్టీలోని మొత్తం 10 మందితో కూడిన శిబిరమంతా రిషిని ద్వేషిస్తోందని 'ది టైమ్స్' పత్రిక పేర్కొంది. పీఎం పోస్టుకు రేసులో తాను ఉండబోనని, ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉంటానని జాన్సన్ చెప్పారట.. ప్రధానిగా సూనక్ ని ఎన్నిక చేసిన పక్షంలో ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల మెతక వైఖరి పాటించవచ్చునని కూడా బోరిస్ భావిస్తున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఆర్ధిక మంత్రిగా రిషి సమర్థంగా వ్యవహరించలేకపోయారని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారట.
కానీ సూనక్ సన్నిహితులు ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. రష్యాపై కఠిన ఆంక్షలను అమలు పర్చేందుకు ఆయన చాలా కృషి చేశారని, తన పదవికి సంబంధించి సమర్థంగా వ్యవహరించారని వాళ్ళు ఆయనను సమర్థించారు. అటు రిషి సూనక్ మాత్రం ప్రధాని పదవికి తానే తగినవాడినని అంటున్నారు. జనరల్ ఎన్నికల్లో లిబరల్ లీడింగ్ సీట్లతో పాటు రెడ్, బ్లూ వాల్ సీట్లను కూడా తను గెలుచుకోగలనని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. అంటే విపక్ష సభ్యుల్లోనూ చాలామంది తన అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపుతున్నారని ఆయన చెప్పారు. దేశంలో జీవన వ్యయం తగ్గించేందుకు కృషి చేస్తానని, ఉద్యోగులకు మెరుగైన వేతనాలు లభించేలా చూస్తానని సూనక్ హామీ ఇస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వం మరింత అప్పుల పాలు కాకుండా చూసేందుకే తను పన్నులను పెంచినట్టు ఆయన చెప్పుకున్నారు.
సూనక్ కి వ్యతిరేకంగా జాన్సన్ 'రహస్య ప్రచారం'
రిషి తప్ప మరెవరినైనా ప్రధానిగా ఎన్నుకోవాలంటూ బోరిస్ జాన్సన్, ఆయన వర్గం రహస్యంగా ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ధిక మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం రిషి.. జాన్సన్ ప్రభుత్వం పడిపోవడానికి ప్రయత్నాలు చేశారని ఈ వర్గం ఆరోపిస్తోంది. జాన్సన్ కి ద్రోహం జరిగిందన్నది వీరి అభియోగం. మొదట సూనక్ రాజీనామా చేశాక వరసబెట్టి మంత్రులంతా అదే పని చేశారంటే ఇందుకు ఆయనే బాధ్యుడని జాన్సన్ మద్దతుదారులు అంటున్నారు. రేసులో రిషి సూనక్ ముందంజలో ఉన్నారని వార్తలు వస్తున్నప్పటికీ ఆయన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఆయన అభ్యర్థిత్వాన్నికొంతవరకు 'నీరు గార్చ వచ్చునని ' కూడా సంకేతాలిస్తోంది. తనకెవరూ వర్కింగ్ క్లాస్ ఫ్రెండ్స్ లేరని లోగడ ఆయన చేసిన వ్యాఖ్యే ఇందుకు కారణం. అంటే తనతో కలిసి పని చేసే స్నేహితులు తన వెంట లేరని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. అంతేకాదు.. భారత సంతతికి చెందిన ఈ 'స్కూల్ బాయ్', మనకేమీ చేయడని కొందరు చేసిన వ్యక్తిగత విమర్శలను కూడా సన్ డే టెలిగ్రాఫ్ ప్రచురించింది. పన్నుల విషయంలో ఈయనను నమ్మజాలమని, ఈయన అబద్దాలకోరని మరికొందరు ఆరోపించారు. ఏమైనా .. బోరిస్ జాన్సన్ తాజాగా సూనక్ పట్ల చేసిన వ్యాఖ్యలు 'జాతి వివక్ష' ను సూచిస్తున్నాయా అన్న అభిప్రాయాలకు తావిస్తున్నాయి.