పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 50 మందికిపైగా మృతి
ఈ ఘటనలో 52 మంది మృతిచెందగా.. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు జరిగింది. ముహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. ఇదే అవకాశంగా జరిగిన పేలుడులో 52 మంది మృతిచెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు.
మిలాద్ ఉన్ నబీ సందర్బంగా జరిగిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని ప్రార్థనలు చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఓ సూసైడ్ బాంబర్ డీఎస్పీ కారు పక్కనే తనను తాను పేల్చుకోవడంతో ర్యాలీలో విధులు నిర్వహిస్తున్న మస్తుంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) నవాజ్ గష్కోరితో సహా 52 మంది మరణించారు. వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది, ఇతర అధికారులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతదేహాలను గుర్తించడం, గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించడం చేపట్టారు.
ఈ ఘటనలో 52 మంది మృతిచెందగా.. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
దీన్ని ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు అధికారులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని క్వెట్టాకు తరలించామని, అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని విధించామని బలూచిస్థాన్ తాత్కాలిక సమాచార మంత్రి జాన్ అచక్జాయ్ చెప్పారు. అయితే ఈ ఘటన ఎలా జరిగింది అనేదానిపై పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అలాగే ఈ దాడికి తామే కారణం అని ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇప్పటివరకు ప్రకటన విడుదల చేయలేదు.