Telugu Global
International

హవాయి ద్వీపంలో కార్చిచ్చు.. 36 మంది సజీవ దహనం

మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. దాదాపు 271 నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎక్కడ చూసినా దట్టమైన పొగలు కనిపిస్తున్నాయి.

హవాయి ద్వీపంలో కార్చిచ్చు.. 36 మంది సజీవ దహనం
X

అమెరికాకు చెందిన హవాయి ద్వీప సమూహంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. టూరిస్టు ప్రదేశమైన మావీయ్ ద్వీపం ఇప్పుడు మంటల్లో విలవిల్లాడుతోంది. మంటలకు బలమైన గాలులు తోడవడంతో అక్కడంతా అల్లకల్లోలంగా మారింది.


దావాగ్నిచుట్టుముట్టడంతో ప్రజలు ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని పడవల్లో ద్వీపాన్ని వీడుతున్నారు. అగ్నికీలల కారణంగా ఇప్పటికే అక్కడ 36మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. దాదాపు 271 నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎక్కడ చూసినా దట్టమైన పొగలు కనిపిస్తున్నాయి.




మంటలు వ్యాపించే ప్రమాదమున్న ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దావాగ్ని చుట్టుముట్టిన పరిస్థితుల కారణంగా అధికారులు 16 రోడ్లను మూసివేశారు. ప్రస్తుతం ఒకే ఒక్క హైవే మాత్రమే అందుబాటులో ఉండటంతో.. ఆ మార్గం గుండా వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కార్చిచ్చు కారణంగా గాయపడిన 20 మందిని ఎయిర్ అంబులెన్స్‌ల ద్వారా హొనలూలోని ఓ ఆస్పత్రికి తరలించారు.



మావీయ్‌ ద్వీపంలో తీవ్ర బీభత్సం సృష్టిస్తున్న కార్చిచ్చుకు బలమైన గాలులు తోడవడంతో అంతకంతకూ మంట‌లు విస్తరిస్తున్నాయి. మంగళవారం హవాయి సమీపంలో గంటకు 82 మైళ్ల వేగంతోనూ, అలాగే మావీయ్‌లో గంటకు 62 మైళ్ల వేగంతో గాలులు వీచాయని పేర్కొన్నారు. ఈ ద్వీపంలో చెట్లు మాడిపోడం, విరిగిపోడం వల్ల విద్యుత్ సరఫరా పూర్తిగా దెబ్బతిని వేలాది కుటుంబాలు అంధకారంలో చిక్కుకున్నాయి.




ఇప్పటికే అత్యవసర ప్రతిస్పందనా బృందాలు సహాయక చర్యలు చేపడుతుండగా.. ఆర్మీ, నేవీ కూడా రంగంలోకి దిగాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు అన్ని విధాల కృషి చేస్తామని చెప్పారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.



First Published:  10 Aug 2023 5:14 PM IST
Next Story