Telugu Global
International

అఫ్గాన్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత

అఫ్గానిస్థాన్‌ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలే కనిపిస్తున్నాయి.

అఫ్గాన్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత
X

పశ్చిమ అఫ్గానిస్థాన్‌ మరోసారి భూప్రకంపనలతో గజగజలాడిపోయింది. హెరాత్ నగరానికి సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్ఓఎస్) ప్రకటించింది. భూగర్భంలో దాదాపు 8 కిలోమీటర్ల వరకూ ఈ ప్రభావం కనిపించింది. ఆ తరవాత మరోసారి 5.5 తీవ్రతతో భూమి కంపించింది. అయితే..వీటి వల్ల ఎంత నష్టం వాటిల్లింది అన్నది ఇంకా తెలియలేదు.

అఫ్గానిస్థాన్‌ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలే కనిపిస్తున్నాయి. వరుస భూకంపాలలో మరణించినవారిలో 90% కంటే ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని UN పిల్లల ఏజెన్సీ యూనిసెఫ్ తెలిపింది. ఎందుకంటే తాలిబాన్ పాలనలో మహిళలు, బాలికలకు వారి ప్రాథమిక హక్కులను నిరాకరించారు, విద్య, పని మరియు సమాజంలో భాగం కావడం నిషేధించబడింది. దీంతో వారు ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. ఈ భూకంపాలతో అనేక మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు, చాలామంది గాయాల పాలయ్యారు. అయితే ఈ ప్రకంపనల కారణంగా దాదాపు 12వేల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. తాలిబన్లు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ భూకంపాల కారణంగా 2 వేల మంది పైగా మృతి చెందారు. జెండా జన్‌లోనే దాదాపు 1,294 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1,688 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. మొదటి సారి భూకంపం వచ్చినప్పుడు తీవ్రత 6.3 గా నమోదైంది. తరువాత సుమారు 7 సార్లు భూమి కంపించింది. చాలా వరకూ గ్రామాల ఆనవాళ్లు తుడిచి పెట్టుకుపోయాయి. మట్టిదిబ్బలుగా మిగిలిపోయాయి. భూకంప సమయంలో ప్రాణ భయంతో దిక్కున్న చోటికి పరుగులు పెట్టినవారు ఇప్పుడు తమ వాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. ఆ శిథిలాల మధ్యే జల్లెడ పడుతున్నారు. రోజులు గడుస్తున్నా మట్టిదిబ్బల్లా మారిన ఇళ్ల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.


First Published:  15 Oct 2023 1:20 PM IST
Next Story