ఎన్నాళ్ళో వేచిన హృదయం.. పాకిస్తాన్ లో సొంత ఇంటికి 90 యేళ్ళ బామ్మ ఒంటరి పయనం!
"ఎక్కడ నీ హృదయం ఉంటుందో అదే నీ గృహమై ఉంటుంది." అంటారు పెద్దలు. ఎప్పుడో ఇల్లు విడిచి భారత దేశానికి వచ్చిన ఓ బాలిక కుటుంబం. దాదాపు 75 యేళ్ళ తర్వాత ఇప్పుడు ఆమె 90 యేళ్ళ వయసులో తిరిగి పాకిస్తాన్ లోని ఆమె ఇల్లు 'ప్రేమ్ నివాస్' కు వెళ్ళింది.
"ఎక్కడ నీ హృదయం ఉంటుందో అదే నీ గృహమై ఉంటుంది." అంటారు పెద్దలు. ఎప్పుడో ఇల్లు విడిచి భారత దేశానికి వచ్చిన ఓ బాలిక కుటుంబం. దాదాపు 75 యేళ్ళ తర్వాత ఇప్పుడు ఆమె 90 యేళ్ళ వయసులో తిరిగి పాకిస్తాన్ లోని ఆమె ఇల్లు 'ప్రేమ్ నివాస్' కు వెళ్ళింది.
"నేను ఎంతో థ్రిల్‌కు లోనవుతున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. నా జీవితమంతా నేను తిరిగి ఇక్కడకు రావాలనే కలలు కన్నాను. నేను నా ఇంటికి, నేను తిరుగాడిన వీధికి తిరిగి రావాలని కోరుకున్నాను." అని అన్నారు రీనా వర్మ ఎంతో ఉద్వేగంతో.
ఆమె 'ప్రేమ్ నివాస్ ' ను చూసేందుకు అట్టారి-వాఘా సరిహద్దును దాటింది. ఆమె ఈ సందర్భంగా అక్కడ ఉన్న కొందరితో ముచ్చటించింది. ప్రస్తుతం ఆమె పూణేలో నివసిస్తున్నారు. రీనా చిరకాల వాంఛ తీర్చుకునేందుకు ఒంటరిగా పాకిస్తాన్‌కు వెళ్లారు.
భారత్ కు ఇలా చేరింది..
మతపరమైన అల్లర్ల భయంతో 1947లో 15 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌లోని రావల్పిండిలోని తన ఇంటిని రీమా వర్మ విడిచిపెట్టారు. అప్పట్లో వేసవి సెలవుల కోసం రీనా ఆమె తోబుట్టువులు హిమాచల్‌లోని సోలన్‌కు వెళ్లారు. తర్వాత వాళ్ల అమ్మ వాళ్లతో కలిసింది. ఆమె కుటుంబం త్వరలో రావల్పిండికి తిరిగి రావాలని ఆశించింది. అయితే, భారత్-పాకిస్తాన్ విభజనతో పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. రీనా, ఇప్పుడు 90 ఏళ్ల వయస్సులో, పాకిస్తాన్‌లోని రావల్పిండిలోని తన తండ్రి పేరు మీద ఉన్న ప్రేమ్ గలిలోని తన పాత ఇంటిని సందర్శించగలుగుతోంది.
"మా నాన్నకు చాలా ప్రగతిశీల ఆలోచనలు ఉన్నాయి. అతను నా తోబుట్టువుల మధ్య ఎప్పుడూ భేదభావాలు చూపలేదు. మా అక్క లాహోర్‌లో ఒక హాస్టల్‌లో ఉంటూ 1937లో ఆమె బిఎబిటి టీచర్ శిక్షణను పూర్తి చేసింది. మా నాన్న మమ్మల్ని ఎప్పుడూ అడ్డుకోలేదు. మేము ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంత వరకు చదువుకోవాలని ఆయన చెప్పేవారు. ఆయన మాలో ఒకరిని శాంతినికేతన్‌కు పంపాలనుకున్నాడు, ఎందుకంటే ఆ సమయంలో ఆయనకు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఎంతో అభిమానం ఉండేది." అని రీనా అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చెప్పారు.
"అందుకే నేను చాలా మంది ఎదుర్కొన్న భయానక పరిస్థితులను ఎదుర్కోలేదని చెప్పగలను. కానీ నా చదువు దెబ్బతింది. నా మెట్రిక్ మాత్రమే అక్కడ పూర్తి చేసాను. అయితే, 1956లో నేను కళాశాల నుండి పట్టభద్రురాలినయ్యాను" అని రీనా వర్మ చెప్పారు.
ఫేస్ బుక్ ద్వారా రావల్పిండి ప్రేమ్ గలి ఆచూకీ తెలిసింది!
రీనా తన చిన్ననాటి ఇంటిని చూడాలని, ప్రేమ్ గలిని సందర్శించాలని కలలు కనేది. అక్కడ అందరూ ఆమెను తోషి అని పిలుస్తారట. రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి సమయంలో తన పాకిస్థాన్ ఇంటి చిత్రాలను రీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాటి ఆధారంగా పాకిస్తాన్‌లోని రావల్పిండికి చెందిన సజ్జాద్ భాయ్ అనే వ్యక్తి ఆమె స్థలం కోసం వెతికాడు. చివరకు అతను ఇంటి ఫోటోలు తీసి ఆమెకు వీడియో కూడా పంపాడు. రావల్పిండి నుంచి వచ్చిన తమ ఇంటి పొటోలను, ఊరగాయలు నిల్వ చేసే ఒక పాత్ర ఇత్తడి కాడ వంటి పొటోలను అందరికీ చూపుతూ ఎంతో ఆనందించిందట.
గుర్గావ్‌లో నివసిస్తున్న రీనా కుమార్తె, సోనాలి, తన తల్లికి పాకిస్తాన్ వీసా కోసం దరఖాస్తు చేసి సహాయపడింది. కానీ, రీనా వీసా ఆమోదం పొందలేదు. అయితే చివరగా, ఒక వీడియో తీయమని సూచించిన పాకిస్తాన్ జర్నలిస్ట్ సలహా మేరకు రీనా మరో వీడియో పంపింది. ఇది సోషల్ మీడియాలో వైరలవడంతో ఆమె కేసు పాకిస్థాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖార్ దృష్టికి వచ్చింది.
ఎట్టకేలకు 90-రోజుల వీసా!
పాకిస్థాన్‌లోని రావల్పిండిలోని తన ఇంటికి వెళ్లేందుకు రీనాకు చివరకు 90 రోజుల వీసా జారీ చేశారు. దీంతో ఆమె ఎట్టకేలకు నేడు సరిహద్దులు దాటి పాకిస్తాన్ లోని తన ఇంటిని సందర్శించగలుగుతున్నారు. ప్రేమ్ గలికి సంబంధించిన ఆమె జ్ఞాపకాలు ఆమె మదిలో పదిలంగా స్పష్టంగా ఉన్నాయంటున్నారు.
దేశ విభజన వల్ల ఆమె తల్లిదండ్రులు పాకిస్థాన్‌లో ఉన్న వారి ఆస్తులను వదిలి ఢిల్లీలో స్థిరపడాల్సి వచ్చింది. వారు కనీసం భూమిని కూడా పొందలేకపోయారు. వారి జీవితమంతా అద్దె ఇంటిలోనే గడిపారు. అయితే తన జీవితంలో ఇన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నప్పటికీ, రీనాకు ఎలాంటి పగలు, ప్రతీకారాలు లేవు. ప్రేమ అనుబంధాలే ఊపిరి. పాకిస్తాన్‌లో తను విడిచిపెట్టిన దాని పట్ల ప్రేమ, వ్యామోహాలను మాత్రమే పెంచుకుంటూ జీవించానంటున్నారు రీనా.
మనం పరస్పరం గౌరవించుకోవాలి
"పాకిస్తాన్ ఏర్పడినప్పుడు, మేము ఒక కుటుంబంగా అన్నింటిని ఎదుర్కొన్నాము, ప్రజలు ఎప్పుడూ చెడ్డవారు కాదని నాకు మా నాన్న చెప్పేవారు. ఏ పరిస్థితి వచ్చినా మీరు దానిని అలాగే ఎదుర్కోవాలి."అని చెప్పేవారన్నారు.
"పాకిస్తాన్ ప్రజలు మనలాంటి వారే. వారు, మేము పరస్పరం కలవాలనుకుంటున్నాము. ప్రభుత్వాలకు, మతపరమైన వ్యక్తులకూ తెలుసు వారేం చేస్తున్నారో. కానీ వారు ఇలా చేయకూడదు. మనం ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలి . అప్పుడే మనం కలిసి జీవించగలం." అని రీనా చెప్పారు.
"ఈ వయసులో పాకిస్థాన్‌కు ఒంటరిగా ప్రయాణించే ధైర్యం నాకు ఉంది, ఎందుకంటే అక్కడి ప్రజలు నాపై చాలా ప్రేమను కనబరిచారు. నేను నిజంగా ఇంటికి తిరిగి వెళ్తున్నట్లు భావిస్తున్నాను." అని ఆనందంగా చెప్పారు.