గ్రీన్‌కార్డు గండం.. 4 లక్షల మంది ఇండియన్లకు షాక్..!
గ్రీన్‌కార్డు జారీపై ఉన్న పరిమితుల నేపథ్యంలో వీరందరికీ గ్రీన్ కార్డు ప్రక్రియ పూర్తి కావాలంటే దాదాపు 134 ఏళ్ల సమయం పడుతుందని అంచనా.
యునైటెడ్ స్టేట్స్‌లో గ్రీన్‌కార్డు అందుకోకముందే 4 లక్షల మందికిపైగా భారతీయులు చనిపోతారని ఓ సర్వే రిపోర్టు తేల్చింది. ఎందుకంటే గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటమే ఇందుకు కారణం. ఒక్క భారతీయులకు సంబంధించే దాదాపు 11 లక్షల గ్రీన్‌కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. `గ్రీన్‌కార్డు` దీనినే పర్మినెంట్ రెసిడెంట్ కార్డు అని కూడా పిలుస్తారు. ఈ కార్డును అమెరికాలో వలసదారులు శాశ్వత నివాసం ఉండేందుకు జారీ చేస్తారు.
అమెరికాలో ఇప్పుడు దాదాపు 18 లక్షల ఎంప్లాయిమెంట్ బేస్డ్ గ్రీన్‌కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ఇందులో 63 శాతం భారతీయులవే అని కాటో ఇనిస్టిట్యూట్ తన రిపోర్టులో వెల్లడించింది.
గ్రీన్‌కార్డు జారీపై ఉన్న పరిమితుల నేపథ్యంలో వీరందరికీ గ్రీన్ కార్డు ప్రక్రియ పూర్తి కావాలంటే దాదాపు 134 ఏళ్ల సమయం పడుతుందని అంచనా. ఈ గ్రీన్‌కార్డు జారీ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేసరికి దరఖాస్తుదారులలో దాదాపు 4 లక్షల 24 వేల మంది చనిపోతారని.. అందులో 90 శాతం భారతీయులే ఉంటారని రిపోర్టు తేల్చింది.
H-1B వీసాపై అమెరికాలో ఉంటున్న వారి పిల్లలు H-4 వీసా కింద తల్లిదండ్రులతో కలిసి ఉండొచ్చు. అయితే H-4 కేటగిరి కింద పిల్లల వయస్సు 21 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే అమెరికాలో ఉండే వీలు ఉంటుంది. తర్వాత అక్కడ ఉండేందుకు అనుమతి ఉండదు. అయితే డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌గా ఇలాంటి వాళ్లకు రెండు అవకాశాలుంటాయి. F1 అంటే స్టూడెంట్ వీసా పొందడం.. లేదా తిరిగి సొంత దేశానికి వెళ్లిపోవడం. చిన్నప్పటి నుంచి అమెరికాలోనే చదువుకుని.. చివరకు దేశం విడిచివెళ్లడం కష్టంగా ఉంటుంది.
ఇక గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగం చేసేందుకు బైడెన్ సర్కార్ ఇటీవల పౌరసత్వ బిల్లును అక్కడి కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. గ్రీన్‌కార్డుల జారీకి దేశాలవారీ కోటాను ఎత్తివేయాలని.. H-1బీ వీసాలలో ముఖ్యమైన మార్పులు చేయాలనేది ఈ బిల్లు ఉద్దేశం. దేశాల కోటాల వల్ల గడిచిన సంవత్సరాల్లో ఎవరికీ కేటాయించకుండా మిగిలిన గ్రీన్‌కార్డులను వలసదారుల సంతానానికి, భార్య లేదా భర్తకు మంజూరు చేయడం ద్వారా వారి కుటుంబాలను ఒక్కటి చేయాలని సిఫార్సు చేసింది. కుటుంబాల వలసకు దేశాల వారీ కోటాలను పెంచాలని బిల్లులో ప్రతిపాదించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే లక్షలాది భారతీయులతో పాటు మెక్సికన్, చైనీయులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
*