Telugu Global
International

అఫ్గాన్‌లో భారీ భూకంపం.. - 320 మంది మృతి.. వెయ్యి మందికి పైగా గాయాలు

భూకంప ప్రభావంతో హెరాత్‌ జిల్లాలోని నాలుగు గ్రామాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.

అఫ్గాన్‌లో భారీ భూకంపం.. - 320 మంది మృతి.. వెయ్యి మందికి పైగా గాయాలు
X

అఫ్గానిస్థాన్‌లో పెను భూకంపం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం వరుసగా ఏడు సార్లు వచ్చిన ప్రకంపనలు ఆ దేశ పశ్చిమ ప్రాంతాన్ని వణికించాయి. వాటిలో ఐదు ప్రకంపనలు తీవ్రస్థాయిలో ఉండటం గమనార్హం. వీటి ప్రభావంతో వందల ఇళ్లు నేల కూలాయి. ఈ ఘటనలో 320 మంది మృత్యువాత పడ్డారని, వెయ్యి మందికి పైగా గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి వర్గాలు వెల్లడించాయి. అఫ్గానిస్థాన్‌ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు మాత్రం 120 మందికి పైగా మృతిచెందారని చెబుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

ఈ భూకంప ప్రభావంతో హెరాత్‌ జిల్లాలోని నాలుగు గ్రామాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం హెరాత్‌ నగరానికి వాయవ్య దిశగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన ప్రకంపనం తర్వాత వచ్చిన ప్రకంపనలు 5.5 తీవ్రతతో ఉన్నాయని తెలిపింది. వీటి ప్రభావం హెరాత్‌ నగరంలోనూ కనిపించిందని స్థానికులు వెల్లడించారు. ఈ ప్రాంతం ఇరాన్‌ సరిహద్దులకు సమీపంలో ఉంది.

2022లోనూ అఫ్గానిస్థాన్‌ తూర్పు ప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపేసింది. సుమారు వెయ్యిమంది చనిపోగా 1500 మంది వరకు అప్పుడు గాయపడ్డారు. నేపాల్‌ పశ్చిమ ప్రాంత జిల్లా బఝంగ్‌ లోనూ శనివారం మధ్యాహ్నం సమయంలో వెంట వెంటనే రెండు సార్లు భూమి కంపించింది. అయితే ఎలాంటి నష్టం సంభవించలేదని తెలుస్తోంది.

First Published:  8 Oct 2023 8:37 AM IST
Next Story