Telugu Global
Telangana

నరేందర్‌రెడ్డి అరెస్టు విధానాన్ని తప్పుపట్టిన హైకోర్టు

దాడికి గురైన అధికారుల గాయాలపై సరిగ్గా నివేదించలేదన్న హైకోర్టు

నరేందర్‌రెడ్డి అరెస్టు విధానాన్ని తప్పుపట్టిన హైకోర్టు
X

పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కేబీఆర్‌ పార్కు వద్ద వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించింది. మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీసింది. నరేందర్‌రెడ్డి పరారీలో ఉన్నారా? అని పీపీని ప్రశ్నించింది. దాడికి గురైన అధికారుల గాయాలపై సరిగ్గా నివేదించలేదని హైకోర్టు పేర్కొన్నది. తీవ్ర గాయాలైనట్లు రిపోర్టు ఇచ్చి.. చిన్న గాయాలైనట్లు రాశారని చెప్పింది. నరేందర్‌రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్‌రెడ్డి మాట్లాడారని తెలిపిన పీపీ ఈ దశలో పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు. రామాండ్‌ ఆర్డర్‌ను క్వాష్‌ చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్‌ ఆర్డర్‌ క్వాష్‌ పిటిషన్‌పై ఇరువురి వాదనలు ముగిశాయి. పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది. నరేందర్‌రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలను ఇవ్వాలని పీపీని ఆదేశించింది.

అంతకుముందు పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్‌పై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. క్వాష్‌ పిటిషన్‌పై జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశారని, అధికారులపై దాడికి కుట్ర పన్నారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. పట్నం నరేందర్‌రెడ్డి పాత్రపై ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని, అధికారులపై దాడికి రైతులను నరేంద్రరెడ్డి ప్రోత్సహించారని పోలీసులు చెబుతున్నారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

First Published:  20 Nov 2024 12:55 PM IST
Next Story