సొంతింట్లోనే వివక్షకు గురయ్యా.. రేణు దేశాయ్ వ్యాఖ్యలు వైరల్
తాను ఎదుర్కొంటున్న కష్టాల గురించి తాజాగా రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తన జీవితంలోకి పవన్ కళ్యాణ్ రాకముందే కష్టాలు మొదలయ్యాయని ఆమె తెలిపారు.
బద్రి, జానీ సినిమాల్లో నటించినప్పటికీ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే రేణు దేశాయ్ అందరికీ సుపరిచితం. పవన్ కళ్యాణ్ రేణు నుంచి విడాకులు తీసుకొని చాలా ఏళ్లు గడిచినప్పటికీ తరచూ వివాదాల ద్వారా ఆమె పేరు మీడియాలో నానుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరచూ సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన హీరోకు సంబంధించిన ప్రశ్నలు వేస్తూ రేణు దేశాయ్ ని విసిగిస్తుంటారు. దీంతో ఆమె వారికి గట్టిగా సమాధానం ఇస్తూ ఉంటుంది.
విడాకులు తీసుకొని ఏళ్లు గడిచినా నన్ను వదిలేయరా..? అంటూ వారిపై మండిపడుతూ ఉంటుంది. ఈ వివాదాలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఇక ఏపీలో అధికార పార్టీ వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేస్తూ, రేణు దేశాయ్ పేరుని కూడా వివాదాల్లోకి లాగుతుంటారు. పవన్ వల్లే రేణు దేశాయ్ కి కష్టాలు వచ్చాయని వ్యాఖ్యానిస్తుంటారు.
ఇదిలా ఉంటే.. తాను ఎదుర్కొంటున్న కష్టాల గురించి తాజాగా రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తన జీవితంలోకి పవన్ కళ్యాణ్ రాకముందే కష్టాలు మొదలయ్యాయని ఆమె తెలిపారు. తాను పుట్టిన మూడు రోజుల వరకు నాన్న తనను చూడలేదని చెప్పారు. అబ్బాయి పుట్టలేదన్న కోపంతో తనపై నాన్న వివక్ష చూపేవారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తర్వాత కొడుకు పుట్టడంతో తమ్ముడిని నాన్న యువరాజులా పెంచారని వెల్లడించారు.
తనని ఒకలా తన తమ్ముడిని మరోలా చూసుకునేవారని తెలిపారు. తనకు తల్లిదండ్రుల నుంచి ప్రేమ దొరకలేదని.. సొంతింట్లోనే వివక్ష ఎదుర్కోవాల్సి వచ్చిందని.. అందుకే తనకు పుట్టిన ఇద్దరు బిడ్డలను సమానంగా చూసుకుంటున్నట్లు చెప్పారు. రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచే కష్టాలు ఎదుర్కొన్నారని, పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకున్న తర్వాత కూడా అవి కొనసాగినా.. ఇద్దరు బిడ్డలను ధైర్యంగా పెంచుకుంటున్న మీకు అండగా ఉంటామని పలువురు నెటిజన్లు రేణుకు భరోసా ఇచ్చారు.