Telugu Global
Telangana

బిగ్ బాస్ తో నారాయణకు పేచీ ఏంటి..?

బిగ్ బాస్ లో అమ్మాయిలకు గుండ్లు కొట్టించాలంటూ సీపీఐ నారాయణ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారు ముమ్మాటికీ వ్యభిచారులేనని అన్నారు.

బిగ్ బాస్ తో నారాయణకు పేచీ ఏంటి..?
X

బిగ్ బాస్ అంటే ఇక్కడ చిరంజీవి, బిగ్ బాస్ షో రెండూ అనుకోవచ్చు. గతంలో చిరంజీవిపై కూడా తీవ్రమైన కామెంట్లు చేసి చివరకు నాలుక కరచుకున్నారు సీపీఐ నారాయణ. క్షమాపణ చెప్పారు. బిగ్ బాస్ షో ని మాత్రం నారాయణ వదిలేలా లేరు. బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలైనప్పుడల్లా నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు, ఈసారి కూడా ఆయన బిగ్ బాస్ లోకి వెళ్లే అమ్మాయిలు వ్యభిచారులంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ అమ్మాయిలకు గుండు కొట్టించాలన్నారు.

మళ్లీ ఎందుకు..?

ఇటీవల నల్గొండ జిల్లాలో వ్యభిచారులనే ముద్రవేసి ఇద్దరు మహిళలకు గుండు కొట్టించిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనను ఖండించారు సీపీఐ నారాయణ. వ్యభిచారులు కాబట్టే గుండు కొట్టించామని అంటున్నారని, మరి బిగ్ బాస్ లో వాళ్లకు కూడా గుండ్లు కొట్టిస్తారా అని ప్రశ్నించారు. బిగ్ బాస్ లో వాళ్లకు మాత్రం చప్పట్లు కొడతారు, సామాన్య మహిళలకు గుండ్లు కొడతారా అని నిలదీశారు. అసలు వ్యభిచారులనే పదాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో నిషేధించిందని, వారిని వ్యభిచారులనడం ముమ్మాటికీ తప్పేనంటున్నారు. కానీ ఆయన మాత్రం బిగ్ బాస్ మహిళల్ని వ్యభిచారులంటూ కామెంట్ చేశారు.

పేర్లు మార్చుకుంటూ పోతే ఎలా..?

ఇక ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుని, వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చడంపై కూడా నారాయణ స్పందించారు. యూనివర్శిటీ పేరు మార్చడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఏపీలో ప్రభుత్వం శాశ్వతం కాదని, తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా పేర్లు మార్చుకుంటూ పోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రతిపక్షంలో కూర్చుందని, ఇప్పుడు ఉన్నవారు కూడా అలానే తప్పులు చేస్తుంటే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తోందన్నారు. యువకులు నాలుగు కాలాలపాటు అధికారంలో ఉంటారనే ఉద్దేశంతోనే తాను ఈ సూచనలు చేస్తున్నట్టు తెలిపారు నారాయణ.

First Published:  21 Sept 2022 7:38 PM IST
Next Story