తమిళనాడుకు బీఆర్‌ఎస్ బీసీ నాయకులు
అక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలపై అధ్యయనం
తమిళనాడులో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి బీఆర్‌ఎస్ బీసీ నాయకుల బృందం త్వరలోనే ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. మంగళవారం తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ బీసీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్, దాని అమలు కోసం జరుగుతోన్న ప్రయత్నాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు సహా అపలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. త్వరలోనే తమిళనాడులో పర్యటించి అక్కడ బీసీల సంక్షేమం కోసం డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, బీసీల అభివృద్ధి కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై స్టడీ చేయాలని కేటీఆర్ సూచించారు. సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జోగు రామన్న, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బూడిద భిక్షమయ్య గౌడ్, నాయకులు జూలూరు గౌరీశంకర్, ఆంజనేయులు గౌడ్, శుభప్రద పటేల్, ఉపేంద్రాచారి, కిశోర్ గౌడ్, చిరుమళ్ల రాకేశ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాజారాం యాదవ్, రవీందర్ సింగ్, ఆలకుంట హరి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.